
దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ త్రిష కృష్ణన్. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరలవుతుంది.

ఇప్పటికే విజయ్ దళపతి, ఆయన భార్య సంగీత మధ్య విడాకులు.. ఈ వివాదంలో త్రిష పేరు ప్రముఖంగా వినిపించడం చూస్తున్నాం. మరోవైపు గత రెండు రోజులుగా త్రిషకు సంబంధించి ఇంకో ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. త్వరలోనే ఒక సంపన్న వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిల్ అవ్వబోతున్నారని ప్రచారం నడుస్తుంది.

తాజాగా ఈ రూమర్స్ పై త్రిష స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం తప్పుడు ప్రచారం ద్వారా దృష్టిని ఆకర్షించడానికే కొందరు ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె పరోక్షంగా వెల్లడించారు.

తన ఇన్ స్టా స్టోరీలో.. “నేను సినిమాలు మానేశానని, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నానని, నిన్న రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నానని అంటున్నారు! నేను ఇంకా ఏమైనా చెప్పాలా లేక ఈ రోజు కల్పిత కథల కోటా పూర్తయిందా?” అంటూ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఇన్ స్టాలో "ప్రేమ సర్వస్వం కాదు, ప్రేమ లేనిదే ఏదీ అర్థం కాదు" అంటూ ఓ పోస్ట్ చేసింది. ఈమధ్యకాలంలో త్రిష షేర్ చేసిన ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంది. ప్రస్తుతం విజయ్, సంగీత విడాకుల కేసు కోర్టులోనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు త్రిష గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.