
టాలీవుడ్ పొమ్మంది.. కోలీవుడ్ రమ్మంది.. కొందరు హీరోయిన్లకు ఈ మాట భలే సూట్ అవుతుందిప్పుడు. తెలుగులో వెలుగు వెలిగాక ఆఫర్స్ కరువై అటు ఇటు చూస్తున్న తరుణంలో కోలీవుడ్ నుంచి ఆఫర్స్ పలకరిస్తున్నాయి వాళ్లను.

సినిమాల్లేని హీరోయిన్లకు ఛాన్సులిస్తున్నారు తమిళ దర్శకులు. రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్ అందరికీ ఇదే జరుగుతుంది. అనుపమ పరమేశ్వరన్‌నే తీసుకోండి.. టిల్లు స్క్వేర్‌లో అమ్మడి గ్లామర్ షో చూసాక తెలుగులో ఛాన్సులు క్యూ కడతాయి అనుకున్నారంతా.కానీ తమిళ, మలయాళం నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో బైసన్, లాక్‌డౌన్, డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు అనుపమ.

అలాగే రాశీ ఖన్నా తమిళంలో అగాథియా సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కృతి శెట్టి అయితే పూర్తిగా తమిళ హీరోయిన్ అయిపోయారు. మనమే తర్వాత కృతికి అస్సలు తెలుగులో ఛాన్సులే రావట్లేదు.

ఇదే సమయంలో మలయాళంలో నటించిన ARM బ్లాక్‌బస్టర్ కావడంతో అక్కడే బిజీ అయ్యారు ఈ బ్యూటీ. తమిళంలో కార్తితో వా వాతియార్, జయం రవితో జీని, ప్రదీప్ రంగనాథన్‌తో లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమాలు చేస్తున్నారు కృతి.

పూజా హెగ్డేకు కూడా తమిళం నుంచే ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సూర్యతో రెట్రో సినిమా చేస్తున్నారు పూజా. దాంతోపాటు విజయ్ 69లోనూ హీరోయిన్ పూజానే. ఇవి కాకుండా లారెన్స్ కాంచన సిరీస్‌లోను అడుగుతున్నారు. మొత్తానికి తెలుగు కాదన్నా.. తమిళ ఇండస్ట్రీ ఈ హీరోయిన్స్ అందరినీ ఆదుకుంటుందన్నమాట.