
గత వారం నుంచి మళ్లీ కొత్త సినిమాల సందడి మొదలైపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కందతో పాటు చంద్రముఖి 2 కూడా ఫ్లాప్ అవ్వడంతో బాక్సాఫీస్ నీరుగారిపోయింది. మరి కనీసం ఈ వారం వచ్చే సినిమాలైనా ఊపు తీసుకొస్తాయా..?

అసలు ఈ వారం ఏయే సినిమాలు రాబోతున్నాయి..? అందులో దేనికి ఆడియన్స్‌ను రప్పించే సత్తా ఉంది..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత టాలీవుడ్‌కు మరో విజయం రాలేదు.. ఏ సినిమా లేక జవాన్‌ను 3 వారాలు చూసారు మన ఆడియన్స్.

ఈ వారం కూడా చిన్న సినిమాలే వస్తున్నాయి. అందులో అందరి ఫోకస్ మ్యాడ్‌పైనే ఉంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ యూత్‌ను టార్గెట్ చేసారు. దాంతో పాటు సుధీర్ బాబు మామా మశ్చీంద్ర అక్టోబర్ 6నే విడుదల కానుంది. మామా మశ్చీంద్రలో ఫస్ట్ టైమ్ త్రిపాత్రాభినయం చేసారు సుధీర్ బాబు.

నటుడు, దర్శకుడు హర్షవర్దన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా ఎంతవరకు మెప్పిస్తుందనేది చూడాలి. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ ఇదే వారం రానుంది. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని కిరణ్ కెరీర్‌కు ఇది కీలకంగా మారింది.

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మంత్ ఆఫ్ మధు.. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 కూడా ఇదే వారం విడుదల కానున్నాయి.

ఇక సిద్ధార్థ్ హీరోగా తమిళంలో సెప్టెంబర్ 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్తా సినిమాను తెలుగులో అక్టోబర్ 6న చిన్నా పేరుతో తీసుకొస్తున్నారు. మరి వీటిలో ఏది ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తుందో చూడాలి.