Anil kumar poka |
Jul 17, 2022 | 5:37 PM
సాయి పల్లవిని ఈ మధ్య లేడీ పవర్ స్టార్ అంటున్నారు. దానికి తగ్గట్లుగానే హిట్టు ఫ్లాపులతో పని లేకుండా అదిరిపోయే ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఈమె చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తన కొత్త సినిమా ప్రమోషన్‌లో పవన్ కళ్యాణ్ పేరు వాడుకున్నారు సాయి పల్లవి. అంతేకాదు.. పవన్ సినిమా సెలెక్షన్‌పై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ పవర్ స్టార్‌పై లేడీ పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ఏంటి..?
కొందరు హీరోయిన్లకు సినిమాలున్నంత వరకే క్రేజ్ ఉంటుంది. కానీ మరికొందరికి మాత్రం సినిమాలతో సంబంధం లేని ఇమేజ్ ఉంటుంది. నయనతార, అనుష్క ఆ తరహా ఇమేజ్ సంపాదించుకున్నారు.
వాళ్ళ తర్వాత సాయి పల్లవికే మళ్లీ అంత క్రేజ్ వచ్చింది. ఫిదాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీకి.. మలయాళ సినిమా ప్రేమమ్‌తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఫిదా, ఎంసిఏతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
లవ్ స్టోరీ లాంటి సినిమాలు ఈమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి.ఈ మధ్యే విరాట పర్వం సినిమాతో వచ్చారు సాయి పల్లవి. రానా హీరోగా నటించిన ఈ చిత్రం అంతగా ఆడలేదు.
కానీ ఇందులో పల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మంచి పేరు వచ్చింది. తాజాగా గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చేస్తున్నారు సాయి పల్లవి. తెలుగులో ఈ సినిమాను రానా విడుదల చేస్తున్నారు.
తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులతో న్యాయబద్ధంగా పోరాడి.. అతన్ని ఎలా బయటికి తీసుకొచ్చిందనే కూతురు కథ ఇది. ఇందులో టీచర్‌గా నటించారు సాయి పల్లవి. జులై 15న విడుదల కానుంది గార్గి.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరు తీసుకొచ్చారు సాయి పల్లవి. ఆయనకు ఉన్న ఇమేజ్‌కు వకీల్ సాబ్ చేయాల్సిన పనిలేదు.. కాకపోతే జనంపై ఉన్న బాధ్యత కారణంగానే ఆ సినిమా పవన్ చేసారని నేను అనుకుంటున్నానంటూ కామెంట్ చేసారు సాయి పల్లవి.
కొన్ని కథలు ఆత్మసంతృప్తి కోసం చేస్తాం.. గార్గి నేనలాగే చేసానంటూ చెప్పుకొచ్చారు ఈ భామ. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను గార్గి సినిమా ప్రమోషన్‌కు బాగానే వాడుకుంటున్నారు సాయి పల్లవి.