
వరస ఫ్లాపులొస్తున్నపుడు కూడా మొండిగా ముందుకెళ్తామంటే కుదరదు. ఇప్పుడున్న పోటీలో కచ్చితంగా హిట్టు కొడితేనే రేసులో ఉంటారు.. అది ఎంత పెద్ద హీరో అయినా..! అందుకే రవితేజ ప్లాన్ మార్చేస్తున్నారు.. ఫ్లాప్స్ రాగానే న్యూ ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. 2024లో 3 రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్న ఈయన.. కొత్త ప్రణాళికతోనే రాబోతున్నారు. మరి అదేంటి..?

ధమాకా తర్వాత ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించారు రవితేజ. వెంటనే వాల్తేరు వీరయ్య కూడా హిట్ అవ్వడంతో మాస్ రాజా మళ్లీ దారిన పడ్డాడులే అని పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. కానీ వాళ్ల ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది. సమ్మర్‌లో రావణాసుర.. ఈ మధ్యే టైగర్ నాగేశ్వరరావు సినిమాలు మళ్లీ రవితేజను ఫ్లాపుల్లోకి నెట్టేసాయి. దాంతో రేసులో మళ్లీ వెనకబడ్డారు ఈ సీనియర్ హీరో.

వరసగా ఫ్లాపులు రావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రవితేజ ప్లానింగ్ మార్చేసారు. నిన్నమొన్నటి వరకు అప్‌కమింగ్ దర్శకులు, కొత్త వాళ్లతో పనిచేసిన ఈయన.. కొన్నాళ్లు వాళ్లకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈగల్ తర్వాత అంతా సీనియర్స్‌తోనే వర్క్ చేయాలని చూస్తున్నారు మాస్ రాజా. ఈ నేపథ్యంలోనే తనకు గతంలో మిరపకాయ్ లాంటి హిట్టిచిన హరీష్ శంకర్‌తో సినిమాకు కమిటయ్యారు రవితేజ.

నిజానికి గోపీచంద్ మలినేనితో ఓ సినిమా ప్లాన్ చేసినా.. అది వర్కవుట్ అవ్వలేదు. కొన్ని అనివార్య కారణాలతో గోపీచంద్ సినిమాను వాయిదా వేసారు మైత్రి మూవీ మేకర్స్. ఈ స్థానంలోనే హరీష్ శంకర్ వచ్చారు. ప్రస్తుతం సీనియర్ దర్శకుల వైపు చూస్తున్నారు మాస్ రాజా. అందుకే గోపీచంద్ సినిమా ఆగిపోయినా.. వెంటనే హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్‌కు ఓకే చెప్పారు.

హరీష్ శంకర్ తర్వాత కూడా రవితేజ చూపులన్నీ అనుభవం ఉన్న దర్శకుల వైపే వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే కలర్ ఫోటో సందీప్ రాజ్‌తో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా అప్డేట్ లేదు. మరోవైపు జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్‌తో ఓ సినిమా కమిటయ్యారు మాస్ రాజా. మొత్తానికి మాస్ రాజా ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలిక.