డిసెంబర్ 12 వస్తుందంటే తమిళనాడులో పండగ వాతావరణం వస్తుంది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోజు రజనీకాంత్ పుట్టినరోజు. ప్రతిసారి సూపర్ స్టార్ బర్త్ డేను స్పెషల్ గా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఈసారి కూడా ఇదే కంటిన్యూ కానుంది. సింగిల్ డబుల్ కాదు ఏకంగా ట్రిపుల్ బొనంజా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈసారి రజనీ బర్త్ డే ఎలా ఉండబోతుంది.. ఆరోజు సర్ ప్రైజ్ లు ఏంటి..?
రజినీకాంత్ పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండగ వచ్చినట్టే. దాన్ని ఎప్పుడు గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈసారి కూడా ఇదే జరుగనుంది. డిసెంబర్ 12న రజిని ఆల్ టైం క్లాసిక్ ముత్తు రీ రిలీజ్ కాబోతుంది. దాంతో పాటు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ శివాజీ సినిమాను కూడా మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను రజినికాంత్ బర్త్ డే వీక్ లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు. గతంలో రజనీ పుట్టిన రోజుకు బాబా రీ రిలీజ్ చేస్తే దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పాత సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీకాంత్. జైలర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన తలైవా.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రజిని. దీని షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుపాటి, ఫహాద్ ఫాసిల్, రితిక సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 12న విడుదల కానుంది.
ఓవైపు తలైవా 170తో పాటు డిసెంబర్ 12న 171 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
తన యూనివర్స్ కాకుండా సపరేట్ స్టోరీతో రజిని సినిమా రాబోతుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు లోకేష్. ఈ చిత్ర షూటింగ్ 2024 మార్చి నుంచి మొదలు కానుంది. సినిమాను దసరా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 12న రెండు పాత సినిమాలు.. రెండు కొత్త సినిమాల అప్డేట్స్ తో వస్తున్నారు సూపర్ స్టార్.