
సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించారు సౌందర్య. అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఈ అగ్ర తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్న సౌందర్య చిన్నవయసులో కన్నుమూయడం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రాణిస్తున్న సమయంలోనే సౌందర్య కన్నుమూశారు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు సౌందర్య. అయితే ఓ బ్యూటీ తాను సౌందర్య కూతురిగా నటించాను అని తెలిపింది. సౌందర్య కూతురిగా నటించే అవకాశం కూడా తనకు ఊహించని విధంగా లభించిందని తెలిపింది.ఆమె ఎవరో కాదు నందినీ రాయ్. ఈ అందాల భామ అసలు పేరు నీలం గౌరాణి అని తెలిపారు. చాలా మందికి నీలం అనే పేరును పలకడం కష్టంగా ఉండటంతో నందినిగా మార్చుకుంది.

రాయ్ అనే ఇంటిపేరు మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించిన తర్వాత జోడించబడిందని, ఒక మోడల్ మేనేజ్‌మెంట్ వారు ఐశ్వర్య రాయ్ పేరును స్ఫూర్తిగా తీసుకుని పెట్టుకున్నట్టు తెలిపింది. నందినీ రాయ్ తన అభిమాన నటి గురించి ప్రస్తావించారు. తెలుగులో అప్పట్లో సావిత్రి గారి తర్వాత తను ఎక్కువగా అభిమానించిన నటి సౌందర్య గారని తెలిపారు. సౌందర్య గారిని తన అభిమాన నటిగా పేర్కొంటూ, కెమెరా ముందుకి తాను సౌందర్య గారి వారసురాలిలా వచ్చానన్నారు.

ఒక ప్రకటన షూట్ కోసం తన పాఠశాలకు వచ్చిన దర్శకులు, అప్పట్లో చబ్బీగా, తెల్లగా, బుగ్గలున్న అమ్మాయిల కోసం చూస్తున్నారని, తాను అలాంటి రూపంతోనే ఉన్నానని తెలిపారు. చాలా మంది విద్యార్థుల మధ్య, తనను చూసి పిలిచి, తన పేరు అడిగి, నటిస్తావా అని అడిగారని, అలా తన తల్లిదండ్రుల అనుమతితో ఒక ప్రకటన షూట్‌లో పాల్గొన్నానని నందినీ రాయ్ తన చిన్ననాటి అనుభవాన్ని వివరించారు. ఆ ప్రకటన షూట్ తనకు సినీ రంగ ప్రవేశానికి ఒక ముఖ్యమైన మెట్టుగా నిలిచిందని తెలిపారు.

ఇక నందిని రాయ్ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ సినిమాల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సినిమాలపరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అలాగే తెలుగు బిగ్ బాస్ లోనూ పాల్గొంది. ఇక నెట్టింట యాక్టివ్ గా ఉండే నందిని రాయ్ తన ఫొటోలతో, వీడియోలతో నెటిజన్స్ మతిపోగొడుతోంది.