సంక్రాంతికి నేను రెడీ అంటూ దమ్ మసాలా బిరియానిని దట్టించి మరీ గట్టిగా చెప్పేశారు మహేష్‌బాబు. ఆయనకన్నా ముందే బరిలోకి దిగాల్సిన డార్లింగ్ మాత్రం ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు. సూపర్‌స్టార్ జోష్ చూసైనా, పబ్లిసిటీని పెంచు డార్లింగ్ అంటున్నారు ఫ్యాన్స్.
ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ, ఎగబడి ముందరికే వెళిపోతాదీ నేనెక్కిన బండీ... అంటూ గుంటూరు కారం సాంగ్ ప్రోమో గట్టిగా వైరల్ అవుతోంది. 2024 సంక్రాంతికి రావడం పక్కా అని ప్రోమోలోనూ మరోసారి చెప్పేశారు మేకర్స్. జనవరి 12న... ఇన్ సినిమాస్ అంటూ మాస్‌కి కనెక్ట్ అయ్యేలా మరోసారి చెప్పేశారు.
గుంటూరు కారం సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి దమ్ మసాలా బిరియాని అంటూ తెగ పాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సారి త్రివిక్రమ్ మాస్ బిర్యానీ వడ్డించడం పక్కా అంటున్నారు. ఇదే జోష్‌తో పబ్లిసిటీ కంటిన్యూ చేస్తే, పండక్కి మేం రెచ్చిపోతాం అంటూ ట్రెండ్ చేసేస్తున్నారు ఘట్టమనేని సైన్యం.
వచ్చే ఏడాది వచ్చే గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ ఇంత జాగ్రత్తగా ఉంటే, ఈ ఏడాది రావాల్సిన సలార్ విషయంలో డార్లింగ్ అంత సైలెంట్‌గా ఎందుకున్నారనే మాటలూ మళ్లీ మొదలయ్యాయి. ఈ డిసెంబర్ మామూలుగా ఉండదు అని కెప్టెన్ ప్రశాంత్‌నీల్ వైపు నుంచి హింట్స్ వస్తున్నా, హీరో సైడ్ నుంచి మాత్రం సైలెన్సే కనిపిస్తోంది.
ఫారిన్‌లో ఉన్న ప్రభాస్ త్వరలోనే ఇండియాకు వచ్చేస్తారు. సలార్ ప్రమోషన్లలో పాల్గొంటారు. గ్రాండ్ ఈవెంట్‌తో ప్రేక్షకులను పలకరిస్తారనే మాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రభాస్ రావడం, పబ్లిసిటీ చేయడం వేరు... అప్పటిలోగా ఆన్‌లైన్‌లో అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నాలైనా చేస్తే బావుంటుందనే రిక్వెస్టులు కనిపిస్తున్నాయి. ఎట్ ప్రెజెంట్ అయితే, మహేష్ జోరు, డార్లింగ్ సైలెన్సు గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు.