
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించిన లెజెండరీ నటి, నిర్మాత కృష్ణవేణి 102 సంవత్సరాలు బ్రతికారు. వందేళ్లు వచ్చినా ఆమె చురుకుగా ఉండేవారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ఆమెది. పశ్చిమ గోదావరిలో జన్మించిన కృష్ణవేణి.. మద్రాస్‌కు వెళ్లి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.

అనేక చిత్రాలలో హీరోయిన్‌గా నటించడంతో పాటు, స్వయంగా స్టూడియోలు స్థాపించి, ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె సినీ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టం "మనదేశం" సినిమా. ఈ చిత్రం ద్వారా దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావుని(ఎన్.టి.ఆర్.) తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.

ఆ చిత్రంలో ఆమె ఎన్.టి.ఆర్. సరసన కథానాయికగా నటించడం విశేషం. ఆ తర్వాత ఆమె మీర్జాపూర్ జమీందార్‌ను వివాహం చేసుకున్నారు. కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి కూడా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ తరం సినిమా అభిమానులకు ఆమె అంతగా తెలియకపోవచ్చు, కానీ 60, 70, 80 దశకాల సినీ అభిమానులు ఆమెను చూడగానే ఎంతో సంతోషిస్తారు.

కృష్ణవేణి నివాసం ఒక చరిత్ర ప్రదర్శనశాలలా కనిపిస్తుంది. ఆమె ఇల్లు ప్యాలెస్‌లా డిజైన్ చేశారు. అనేక అరుదైన, పురాతన వస్తువులతో నిండి ఉంటుంది. ఇంట్లో కనిపించే ప్రతి వస్తువుకూ వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని ఆమె కుమార్తె అనురాధా దేవి వివరించారు. 75 సంవత్సరాల నాటి సోఫాసెట్, 80 నుంచి 100 సంవత్సరాల పురాతనమైన డైనింగ్ టేబుల్‌తో పాటు, పాలెస్ నుంచి తెచ్చిన అల్మిరా వంటివి ఉంటాయి.

కృష్ణవేణి పలు చిత్రాలలో నటించినా... ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు 'లక్ష్మమ్మ, గొల్లభామ'. త్రిపురనేని గోపీచంద్ 'లక్ష్మమ్మ' చిత్రాన్ని మొదట మాలతీతో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్ టేకోవర్ చేసింది. దాంతో అందులో కృష్ణవేణి నాయికగా నటించింది. ఇక 1947లో వచ్చిన 'గొల్లభామ' నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది.