
మామూలుగానే సీక్వెల్ అన్నప్పుడు ముందు సినిమాకు సంబంధించి రిఫరెన్సులు వాడుకుంటారు దర్శకులు. అభిమానులు కూడా అదే ఊహిస్తుంటారు. భారతీయుడు 2 కోసం శంకర్ కూడా ఇదే చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన పాటను చూస్తుంటే పాతికేళ్ళ నాటి భారతీయుడులోని కొన్ని విషయాలు బాగా గుర్తుకొస్తున్నాయి. మరి అవేంటి..? అసలు ఇప్పుడొచ్చిన పాట ఎలా ఉంది..? శంకర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారతీయుడు.

అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు దాదాపు 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు. అదే చేస్తున్నారిప్పుడు శంకర్.

ఓ వైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే.. భారతీయుడు 2 కూడా పూర్తి చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట విడుదలైంది. నాటి భారతీయుడుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే.. సీక్వెల్‌కు ఆ బాధ్యతను అనిరుధ్ తీసుకున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్‌లో కమల్ హాసన్ కనబడలేదు. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్‌తోనే సాంగ్ డిజైన్ చేసారు శంకర్. బ్రిటీషర్స్‌పై హీరో చేసే మారణహోమాన్ని పాటలో చూపించారు దర్శకుడు శంకర్.

ఇండియన్ 2లో కమల్‌తో పాటు కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే.. భారతీయుడులో తెప్పరెల్లిపోయాక పాట గుర్తుకురాక మానదు. ఈ రెండు పాటల్లోనూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి.

జూన్ 1న ఘనంగా భారతీయుడు 2 ఆడియో లాంఛ్ జరగనుంది. జులై 12న విడుదల కానుంది భారతీయుడు 2. ఇదొచ్చిన ఏడాదిలోపే భారతీయుడు 3 కూడా విడుదల కానుంది. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్.