
విజయ్ సేతుపతి తెలుగు వారికి కొత్త కాకపోయినా, మహారాజా సబ్జెక్ట్ తో మరోసారి మనవారి మనసులు గెలుచుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఏ సినిమా చేసినా, అందులో కంటెంట్ కోసం స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు మనవారు.

చేసే ప్రతి సినిమా తనకు నచ్చుతుందని చెప్పే సేతుపతి, 96, విడుదలై, సూపర్ డీలక్స్ సినిమాలు తన కెరీర్‌లో కాస్త స్పెషల్ అనే అంటున్నారు. హిట్, ఫ్లాపులను పట్టించుకోనని చెప్పే మక్కల్ సెల్వన్ ప్రస్తుతం ఏస్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

పూరి జగన్నాథ్ సినిమా గురించి కూడా ఈ ప్రమోషన్లలోనే మాట్లాడారు. బెగ్గర్ అనే టైటిల్‌ని ఇంకా తాము అనుకోలేదని స్పష్టం చేశారు. జూన్ నుంచి పూరి మూవీ సెట్స్ మీదకు వెళ్తుందన్నారు సేతుపతి.

పూరి జగన్నాథ్ సినిమాలన్నీ చూశానని చెప్పిన సేతుపతి, ఆయన పనితీరును ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారు. గంట సేపులోనే కథ చెప్పి, తనను ఆశ్చర్యపరచారని అన్నారు.

పూరి - సేతుపతి సినిమా మీద ఇప్పుడు మంచి బజ్ నడుస్తోంది. ఫ్లాపుల్లో ఉన్న పూరి, ఈ మూవీతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.