
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అంటూ.. ఏవేవో లెక్కలతో పెద్ద సినిమాలన్నీ పక్కకు జరుగుతుంటే, చిన్న సినిమాలన్నీ సందడి చేసుకుంటున్నాయి. దొరికిన డేట్ మీద నువ్వా నేనా అంటూ పోటీ పడి మరీ ఖర్చీఫ్ వేసేస్తున్నాయి.

ఈ వేసవి అచ్చంగా మాదేనని డిక్లేర్ చేస్తున్నారు చిన్న సినిమాల మేకర్స్. ఈ వారం పారిజాత పర్వంతో మొదలయ్యే జాతర.. మేలోనూ కంటిన్యూ అవుతుంది. దెయ్యాన్ని చూస్తే భయపడే మనుషులు... దెయ్యంతో ప్రేమలో పడతారా?

ఈ కొత్త కాన్సెప్ట్ తో సిద్ధమవుతోంది లవ్ మీ సినిమా. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సక్సెస్ మూవీ ప్రతినిధికి సీక్వెల్ ప్రతినిధి2 కూడా ఆడియన్స్ కి హలో చెప్పనుంది.

ఈ రెండు తెలుగు సినిమాలు విడుదలైన మరుసటి రోజే తమిళ్ నుంచి మరో రెండు అనువాద సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రత్నం, రాశీఖన్నా, తమన్నా నటిస్తున్న బాక్ సినిమాలు ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

మే మొదటి వారంలో రద్దీ బాగానే ఉంది. మే 3న విడుదలకు సిద్ధమంటూ ప్రకటించేశారు ఆ ఒక్కటీ అడక్కు మేకర్స్. అల్లరి నరేష్ మళ్లీ ఎంటర్‌టైన్ చేస్తున్న సినిమా ఇది. కృష్ణమ్మ, ప్రసన్నవదనం, శబరి కూడా మే 3నే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఎన్నికల హడావిడి ఎంత ఉన్నా, మంచి కంటెంట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో రిలీజ్‌కి రెడీ అవుతున్నామన్నది మేకర్స్ మాట.