
గతంలో ఓ దర్శకుడు ఓ జానర్లో సక్సెస్ కొడితే తరువాత వరుసగా అదే జానర్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొత్తగా ట్రై చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. తమ కంఫర్ట్ జోన్‌ని పక్కన పెట్టేసి డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల పేరు చెబితే మంచి కాఫీ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా లాంటి క్లాస్ మూవీస్‌తో సూపర్ హిట్స్ ఇచ్చిన శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో డిఫరెంట్ జానర్స్ ట్రై చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. కానీ పూర్తిగా ఓ మాస్ యాక్షన్ మూవీ మాత్రం చేయలేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాతో ఆ ప్రయోగం కూడా చేస్తున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కుబేర సినిమా చేస్తున్నారు శేఖర్.

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్‌తో ఆకట్టుకునే దర్శకుడు హను రాఘవపూడి. రీసెంట్‌గా సీతారామమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ నెక్ట్స్ సినిమాతో కొత్త జానర్ ట్రై చేస్తున్నారు. సీతారామమ్ సినిమాలో వార్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా.. మేజర్‌గా సినిమా అంతా లవ్ స్టోరీ చుట్టే తిరుగుతుంది. కానీ ప్రభాస్‌తో చేయబోయే మూవీని మాత్రం రజకార్ల నేపథ్యంలో పూర్తిగా యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు హను.

కార్తికేయ 2తో నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన చందూ మొండేటి కూడా నెక్ట్స్ మూవీ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ అందుకున్నా... ఇంత వరకు భారీ బడ్జెట్ మూవీని డీల్ చేయలేదు చందూ. కానీ తండేల్ సినిమాతో బిగ్ బడ్జెట్ దర్శకుల సరసన చేరబోతున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది గీతా ఆర్ట్స్.

మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. తొలిప్రేమ సక్సెస్‌తో దర్శకుడిగా సెటిల్ అయిన వెంకీ, రీసెంట్‌గా సర్ సినిమాతో మరో బిగ్ హిట్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్‌లో చేసిన వెంకీ, నెక్ట్స్ మూవీ కోసం మరో జానర్ ట్రై చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు.