
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత కళాతపస్వి కె. విశ్వనాథ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన ఐకానిక్ చిత్రం శంకరాభరణం గురించి తన ప్రశంసలను తెలియజేశారు. కె. విశ్వనాథ్ ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు సంస్కృతి, సంగీతం, కుల వ్యవస్థ, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక-ఆర్థిక సవాళ్లు వంటి విస్తృతమైన ఇతివృత్తాలను తన సినిమాల్లో చూపించారు.

ఆయన సినిమాలు చెల్లెలి కాపురం, స్వాతిముత్యం, శ్రుతిలయలు, స్వర్ణకమలం, సిరిసిరిమువ్వ వంటి చిత్రాలు తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశాయి. 1986లో స్వాతిముత్యం ఆస్కార్ అవార్డుకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. శంకరాభరణం చిత్రం గురించి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.

ఆ చిత్రం వచ్చిన సమయంలో "వేటగాడు," "అడవి రాముడు" వంటి యాక్షన్ చిత్రాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, శంకరాభరణం సంప్రదాయ సంగీతం, వస్త్రధారణ , విలువలకు ప్రాధాన్యతనిచ్చి గొప్ప విజయం సాధించిందని వర్మ గుర్తుచేసుకున్నారు. "శంకరశాస్త్రి లుక్ గానీ మంజు భార్గవి లుక్ కానీ ఇట్ ఈజ్ యాట్ దట్ వాజ్ లైక్ ఏ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్," అని ఆయన అన్నారు.

కాలేజీ రోజుల్లో తాము తాము ఆ సినిమాను ఎగబడి చూశామని, అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్ అని పేర్కొన్నారు. ఈ చిత్రం పాశ్చాత్య సంగీతపు ప్రభావానికి వ్యతిరేకంగా మన భారతీయ సంగీతం ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. పాశ్చాత్య సంగీతానికి అలవాటుపడి, తమ స్వంత సంగీతాన్ని విస్మరించిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, శంకరాభరణం రివర్స్ లాజిక్‌లో భారతీయ సంగీత గొప్పతనాన్ని విజయవంతంగా రుజువు చేసిందని వర్మ తెలిపారు.

"పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను" అంటూ ఆ చిత్ర గొప్పతనాన్ని తెలియజేశారు. సినిమా ముగింపులో శంకరశాస్త్రికి సహాయం చేసినది మంజు భార్గవి అని తెలిసినప్పుడు, ఆయన ఇచ్చే ఒక నిశ్శబ్దమైన అంగీకారం చాలా అద్భుతంగా ఉంటుందని వర్మ ప్రశంసించారు.