2017 లో వచ్చిన ‘గల్ఫ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి… హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్లో నర్తించి బాగా పాపులర్ అయ్యింది.
అటు తర్వాత ‘యురేకా’ ,రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’, ధనుష్ – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్రంగి రే’ వంటి క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
డింపుల్ హాయాతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న రామబాణం ప్రమోషన్స్ లో ఈమె పాల్గొన్న టైంలో .. మీరు ఈ ఫ్యామిలీ సినిమాలో వల్గర్ గా కనిపించారు.. అంటూ ఓ రిపోర్టర్ అనడంతో ఈమె బాగా ఫీలైపోయి .. గూగుల్ లో వల్గర్ అనే మాటకు అర్థం వెతుకుతున్నట్టు స్క్రీన్ షాట్ లు షేర్ చేసింది.
ఇదిలా ఉండగా ఐపీఎస్ అధికారి కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిన ఘటనలో సినీ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్ హుడా ఎన్‌క్లేవ్ జర్నలిస్టు కాలనీలోని ఎస్‌కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ఐపీఎస్ అధికారి ఫ్లాట్‌లో అద్దెకుంటున్నారు. ఇదే అపార్ట్‌మెంట్స్‌లో సినీ నటి డింపుల్ హయతి కూడా అద్దెకుంటున్నారు.
ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి అధికారిక వాహనాన్ని (టీఎస్ 09 పీఏ 1744) అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేశారు. అయితే సదరు నటి డింపుల్ ఈ వాహనాన్ని తరచూ కాలితో తన్నడమే కాకుండా తన కాబోయే భర్త డేవిడ్‌తో కలిసి బెంజి కారు (ఏపీ 09 సీఎల్ 0927)తో రివర్స్ తీసుకొచ్చి డ్యామేజీ చేస్తున్నట్లు గుర్తించిన కారు డ్రైవర్ ఇదేమిటని పలుమార్లు ప్రశ్నించారు.
మీ సార్ ఐపీఎస్ అధికారి అయితే మేం భయపడాలా అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడటమే కాకుండా పోలీసులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నది. ఈ కారుకు భద్రతగా ఏర్పాటు చేసిన కోన్స్‌ను కూడా ఆమె పీకిపడేసేది.
డ్రైవర్ నచ్చజెప్పేందుకు చూసినా ఆమె వినిపించుకోకపోగా ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. దీంతో అధికారి డ్రైవర్ చేతన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్‌పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 353, 341, 279 కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు పిలిపించారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది.