ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా 48 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. క్రియేటివ్ అండ్ లైఫ్ రైటింగ్‌లో తాజాగా రీసెర్చ్ థీసిస్‌ను సమర్పించిన ఆమె లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది ట్వింకిల్ ఖన్నా.
అంతకుముందు ట్వింకిల్ ఖన్నా మాస్టర్స్ డిగ్రీ కోసం 5 యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోగా అందులో నాలుగు కాలేజీల్లో అవకాశం వచ్చింది. ట్వింకిల్ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది.
కాలేజీల్లో నా వయసు వారు తమ పిల్లలను డ్రాప్ చేయడానికి వచ్చేవారు. వారితో స్నేహం చేయడం చాలా కష్టమైంది. అయితే నేను నా లక్ష్యంపైనే దృష్టి సారించాను. వయసు అనేది ఒక అంకె మాత్రమే. ఎక్కడైనా మనం సాధించిన విజయాలకే గుర్తింపు ఉంటుంది.
కాగా 48 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్న ట్వింకిల్‌ను ఆమె భర్త అక్షయ్ కుమార్ అభినందించారు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్? అని ఇన్‌స్టా వేదికగా అడిగాడు. అక్షయ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ట్వింకిల్‌కు కంగ్రాట్స్ తెలిపారు.
ట్వింకిల్ ఖన్నా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. విక్టరీ వెంకటేష్ నటించిన శీను సినిమాలో ట్వింకిల్ ఖన్నానే కథానాయిక. అయితే బాలీవుడ్‌లోనే ఎక్కువగా నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది.