
హీరోల మార్కెట్‌తో పనిలేకుండా బడ్జెట్ పెట్టినపుడు ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్‌లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

ఈ లెక్చర్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? నాగ చైతన్య సినిమాకు కూడా ఊహకు మించిన బడ్జెట్ పెడుతున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది..? ఈ మధ్య హీరోల మార్కెట్‌ను పట్టించుకోకుండా బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు.

అదేంటని అడిగితే తమ లెక్కలు తమకున్నాయి అంటున్నారు. పాన్ ఇండియా కారణంగా నాన్ థియెట్రికల్ నుంచే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయి. దాంతో బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్.

తాజాగా చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ 2 ఇలాంటి భారీ ప్రయోగమే చేయబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూకు సక్సెస్ లేదు. బంగార్రాజు హిట్టైనా అందులో నాగార్జున ఉన్నారు. సోలో హీరోగా నటించిన థ్యాంక్యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి. దాంతో చై మార్కెట్ కూడా పడిపోయింది.

అయితే ఈ ట్రాక్ రికార్డ్‌తో పనిలేకుండా చందూ, చైతూ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. సముద్ర తీర ప్రాంతంలో ఫిషర్ మెన్ లైఫ్ థియరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూ మార్కెట్ 40 కోట్ల లోపే ఉన్నా.. NC23 బడ్జెట్ మాత్రం 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస, గుజరాత్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కార్తికేయ2తో చందూ మొండేటికి పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ లెక్కలు చైతూ సినిమాకు వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అందుకే రిస్క్ అని తెలిసినా.. నో కాంప్రమైజ్ అంటున్నారు బన్నీ వాస్.