
నటి ప్రేమ తన సుదీర్ఘ నటనా ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, అందుకున్న విజయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఉపేంద్ర, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులు, దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఉపేంద్ర దర్శకత్వంలో నటించడం చాలా కష్టమైన అనుభవమని ప్రేమ తెలిపారు. "ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం. అది తెలుగులో చాలా మంది నటులు ఇంటర్వ్యూలలో చెప్పారు" అని ఆమె అన్నారు. ఉపేంద్ర సినిమాలో తాను, దామిని, రవీనా టాండన్ నటించామని, అది చాలా సవాలుతో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఉపేంద్ర తన సినిమాలలో సహజత్వాన్ని కోరుకుంటారని, అది ఎంత కష్టమైనా నిజంగా జరిగేలా చూసుకుంటారని ప్రేమ చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి సౌందర్య. తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమ, సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని మరియు ఆమె మరణం తర్వాత ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నటి ప్రేమ , సౌందర్య కలిసి 'దేవి' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని గుర్తు చేసుకుంది.

సౌందర్య గురించి మాట్లాడుతూ, ఆమె అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, సెట్స్‌లో అందరితో ఎంతో గౌరవంగా ఉండేవారని ప్రేమ కొనియాడారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో కూడా సౌందర్యలో ఎలాంటి గర్వం ఉండేది కాదని, తోటి నటీనటులను ఎంతో ప్రోత్సహించేవారని ఆమె తెలిపారు. సౌందర్య మరణవార్త విన్నప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రేమ పేర్కొన్నారు. అయితే, సౌందర్య పార్థివ దేహాన్ని చూడటానికి తాను వెళ్లలేకపోయానని ఆమె వెల్లడించారు.

"సౌందర్యను ఎప్పుడూ అందంగా, చిరునవ్వుతో చూడాలని కోరుకున్నాను. ప్రమాదం తర్వాత ఆమె భౌతిక కాయాన్ని చూసే ధైర్యం నాకు లేకపోయింది. ఆ విషాదకరమైన స్థితిలో ఆమెను చూడటం నా వల్ల కాలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణించిన ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయని, అప్పట్లో ఆమె చనిపోయారనే నిజాన్ని నమ్మడానికి చాలా కాలం పట్టిందని ప్రేమ తెలిపారు.

ముఖ్యంగా 'దేవి' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, సౌందర్య లాంటి అద్భుతమైన నటి , మంచి మనసున్న వ్యక్తిని కోల్పోవడం పరిశ్రమకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, సౌందర్య అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. సౌందర్య, ప్రేమ కలిసి తెలుగు, కన్నడలో దాదాపు నాలుగు చిత్రాల్లో నటించారు.