
సబ్జా గింజల గురించి చాలామందికి తెలియని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీటిలో పాలలో కంటే ఆరు నుండి ఏడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. రోజుకు రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియంలో 25శాతం అందుతుంది. ఇది ఎముకలు గుల్లబారకుండా, కండరాల తిమ్మిర్లు రాకుండా రక్షించడానికి సహాయపడుతుంది.

సబ్జా గింజల్లో చియా సీడ్స్‌లో ఉండే అంత ఫైబర్ ఉంటుంది, 100 గ్రాములకు సుమారు 25 గ్రాముల ఫైబర్‌ను అందిస్తుంది. ఈ ఫైబర్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రెండు స్పూన్ల సబ్జాలో సుమారు 5-6 గ్రాముల కరిగే ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ ప్రేగులలోని గుడ్ బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగితే, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి, ప్రేగుల రోగనిరోధక శక్తి నియంత్రణలో ఉంటుంది.

సబ్జా గింజల్లోని అధిక ఫైబర్ మెత్తగా నానినప్పుడు, ప్రేగులలో ఒక జిగురు వంటి పొరను ఏర్పరుస్తుంది. ఇది ఆహారం ద్వారా మనం తీసుకునే కొవ్వులు, కొలెస్ట్రాల్ రక్తంలోకి శోషించబడకుండా నిరోధిస్తుంది. ఈ ఫైబర్ హానికరమైన కొవ్వులను, కొలెస్ట్రాల్‌ను బంధించి, శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.

సబ్జా గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి రసాయనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లతో పోరాడడంలో సహాయపడతాయి. ముఖ్యంగా సార్కోమా వంటి బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి, ఈ రసాయనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఉపయోగపడుతున్నాయని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడులో 2016లో జరిగిన పరిశోధనల్లో స్పష్టమైంది.

ఎలా వాడాలి: కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు సబ్జా గింజలను తీసుకోవడం చాలా ముఖ్యం. నీటిలో వేస్తే పది నుండి పదిహేను నిమిషాల్లో నానిపోతాయి. వీటిని పండ్ల సలాడ్‌లు, మొలకలు, లేదా మజ్జిగలో కలుపుకొని రోజుకు రెండు లేదా మూడు స్పూన్లు తీసుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే విత్తనాలలో సబ్జా గింజలు కూడా ఒక ముఖ్యమైన భాగంగా కాబట్టి వీటిని మీ రోజువారి జీవనశైలిలో భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.