
ఇండియాలో ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. సీటు ముందుగానే కన్ఫార్మ్ చేసి ఉంటుంది గనుక ట్రైన్ బయల్దేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుని హాయిగా ప్రయాణించవచ్చు. ట్రైన్లలో ప్రయాణించేవారిలో దాదాపు 80 శాతం మంది ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే ట్రైన్ టికెట్లలో అనేక రకాలు ఉన్నాయి. కన్ఫార్మ్‌డ్ టికెట్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్ లాంటివాటి గురించి తెలిసిందే. వీటిల్లో ఆర్‌ఏసీ టికెట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆర్ఏసీ అనగా రిజర్వేషన్ అగౌనెస్ట్ కాన్సిలేషన్ అని అర్థం. అంటే ఒకే బెర్త్‌నుు ఇద్దరూ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సగం బెర్త్ మాత్రమే మీకు కేటాయిస్తారు. దీంతో ఈ టికెట్ ఉంటే కేవలం కూర్చుని ప్రయాణం చేసే వెసులుబాటు మాత్రమే ఉంటుంది.

అయితే సగం బెర్త్‌కు పూర్తి టికెట్ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారనే సందేహాం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు తాజాగా రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. కన్ఫార్మ్‌డ్ టికెట్ పొందిన వ్యక్తి తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నా లేదా రాకపోయినా ఆ బెర్త్‌ను ఆర్ఏసీ టికెట్ ఉన్న వ్యక్తికి కేటాయిస్తారు. ఇలాంటి సమయాల్లో పూర్తి బెర్త్ లభిస్తుంది. లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు.

ట్రైన్ బయల్దేరాక కన్పార్మ్‌డ్ టికెట్ ఉన్న వ్యక్తి రాకపోయినా, మధ్యలో వెళ్లిపోయినా ఆ బర్త్‌ను ఆర్‌ఏసీ ప్రయాణికుడికి పూర్తిగా కేటాయించే అవకాశం ఉందని రైల్వేమంత్రి తెలిపారు. ఈ కారణంతో ఆర్ఏసీ టికెట్‌కు పూర్తి స్లీపర్, ఏసీ కోచ్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆర్‌ఏసీ ప్రయాణికుడికి ఎప్పుడైనా పూర్తి బెర్త్ కేటాయించే అవకాశం ఉండటంతో పాటు అదే కోచ్‌లో ప్రయాణించే హక్కు ఉంటుందన్నారు.

ఒకవేళ ఆర్‌ఏసీలో ప్రయాణించేందుకు సిద్దంగా లేకపోతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని, ఇలాంటి సమయంలో రీఫండ్ పొందవచ్చని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడిస్తోంది.