
పండుగ సేల్స్ ప్రారంభం.. దసరా, దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ ఆన్ లైన్ సేల్స్‌లో సాధారణంగానే భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ డీల్స్ నుంచి మరింత లాభపడే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. అందుకే స్మార్ట్ షాపింగ్ చేయాలి. అలా చేయడం ద్వారా అక్కడ అందించే సాధారణ తగ్గింపుతో పాటు పలు క్యాష్ బ్యాక్ లు, రివార్డులు అదనంగా పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఉపయోగపడే స్మార్ట్ షాపింగ్ టిప్స్ మీకు అందిస్తున్నాం.

క్రెడిట్, డెబిట్ కార్డులు వాడాలి.. షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు షాపింగ్ కోసం ఆ కార్డ్‌లను ఉపయోగిస్తే.. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్, అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి పలు ప్రయోజనాలను అందిస్తున్నాయి. అమెజాన్ సేల్లో ఎస్బీఐ కార్డులను వాడటం వల్ల 10శాతం తక్షణ తగ్గింపును అందుకునే అవకాశం ఉంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు.. మీరు మీ పాత ఫోన్‌కి బదులుగా కొత్త ఫోన్ కొనడానికి కొంత తగ్గింపును పొందినట్లయితే, దీని కంటే మెరుగైనది ఏముంటుంది. ఈ తగ్గింపును పొందడానికి మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పండుగ సేల్‌లో పలు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

పోల్చి చూడాలి.. ఒక వస్తువును కొనుగోలు చేసే సమయంలో ఆ వస్తువు వాస్తవ ధర.. ఆఫర్ ధరలో వ్యత్యాసం చూడాలి. అలాగే వివిధ వెబ్ సైట్లలో ఆ వస్తువు ధరను పోల్చి చూడాలి. దానిపై ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్ వంటివి చూసుకోవాలి. దేనిలో అధికంగా లాభపడతామో ఆ ప్లాట్ ఫారం నుంచి కొనుగోలు చేయాలి.

విక్రయానికి ముందస్తు యాక్సెస్.. సేల్లో కొన్ని వస్తువులపై మంచి ఆఫర్లు ఉంటాయి. కానీ చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంటుంది. అలాంటి సమయంలో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌కు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న కొనుగోలుదారులకు ఈ అవకాశం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్‌కు యాక్సెస్‌ను పొందినట్లు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కూడా అదే రకంగా అవకాశం ఇస్తారు.