
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 21న కొత్త లేబర్ కోడ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచే ఇవి అమల్లోకి వస్తాయంటూ ప్రకటించింది. తాజాగా వీటికి సంబంధించి మరో కీలక ప్రకటన వచ్చింది. నాలుగు కొత్త కార్మిక కోడ్‌ల కోసం ముసాయిదా నియమాలను నోటిఫై చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది.

వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియమాలపై ప్రజల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. 45 రోజుల్లోగా కార్మికులు, యాజమాన్యాలు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించింది.

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య భద్రత లభించనుంది. మినిమం బేసిస్ శాలరీ, గ్రాట్యుటీ, బోనస్, పీఎఫ్, ఆరోగ్య బీమా వంటివి ఉద్యోగులందరికీ లభించనున్నాయి. గిగ్ వర్కర్లకు కూడా ఈ కొత్త కార్మిక కోడ్‌లను అమలు చేసేలా నిబంధనలు రూపొందించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేసి ఈ కొత్త కోడ్‌లను ప్రవేశపెట్టారు. ఏ కంపెనీలో పనిచేసే ఉద్యోగికైనా తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్, సంవత్సరానికి ఒకసారి మెడికల్ టెస్టులు, ఓవర్ టైం పనికి రెట్టింపు శాలరీ వంటి బెనిఫిట్స్ జరగనున్నాయి. ఇక పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగాలు, శాలరీ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక, ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే గతంలో ఉద్యోగం ఐదు సంవత్సరాలు చేస్తే గ్రాట్యూటీ కల్పించేవారు. ఇప్పుడు దానిని ఒక సంవత్సరానికి తగ్గించారు. అలాగే పీఎఫ్ సౌకర్యం అందరికీ కల్పించాలని నిబంధనల్లో పొందుపర్చారు.