
ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ఇంట్లో ఏసీ వినియోగాన్ని పెంచేస్తారు. అయితే కరెంట్ బిల్లు తగ్గించాలనే ఉద్దేశంతో గది చల్లబడిన వెంటనే ఏసీని ఆఫ్ చేసి, మళ్లీ వేడెక్కిన తర్వాత ఆన్ చేసే అలవాటు చాలామందిలో కనిపిస్తోంది. కానీ ఇది నిజానికి విద్యుత్ పొదుపు చేయకపోగా, మరింత ఖర్చు పెంచే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎయిర్ కండిషనర్‌లో అత్యధిక విద్యుత్ వినియోగించే భాగం కంప్రెసర్. ఏసీ ఆన్ చేసిన ప్రతిసారీ కంప్రెసర్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభ సమయంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. పదేపదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల కంప్రెసర్‌పై అధిక ఒత్తిడి పడటంతో విద్యుత్ వినియోగం తగ్గకుండా మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇది కేవలం కరెంట్ బిల్లుపైనే కాదు, ఏసీ పనితీరుపైనా ప్రభావం చూపుతుంది. తరచూ రీస్టార్ట్ చేయడం వల్ల కంప్రెసర్, కెపాసిటర్లు, ఇతర ఎలక్ట్రిక్ భాగాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల మరమ్మతుల ఖర్చులు కూడా పెరుగుతాయని టెక్నీషియన్లు చెబుతున్నారు. ఒకవేళ ఏసీని ఆపాల్సి వస్తే కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే తిరిగి ఆన్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇన్వర్టర్ ఏసీలు ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రించే సదుపాయం కలిగి ఉంటాయి. గది చల్లబడిన తర్వాత కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా తక్కువ వేగంతో పనిచేస్తూ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. అందుకే నిపుణులు “ఆటో మోడ్” ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.

కరెంట్ బిల్లు తగ్గించుకోవాలంటే ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే తలుపులు, కిటికీలు మూసివేయడం, ఫిల్టర్లను శుభ్రం చేయడం, సమయానికి సర్వీసింగ్ చేయించడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గుతుందని చెబుతున్నారు.