
స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. వీటి ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయంగా తయారీ కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రాకతో డేటా సెంటర్ల వినియోగం పెరిగిపోయింది. దీని వల్ల మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చు పెరగడం వల్ల స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో వాటి తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుండగా.. వీటిని వినియోగదారులకు బదిలీ చేసేందుకు సిద్దమవుతున్నాయి.

ఇప్పటికే శాంసంగ్, యాపిల్ లాంటి సంస్థలు స్మార్ట్ ఫోన్ ధరలతో పాటు ల్యాప్‌టాప్ ధరలను పెంచేశాయి. మెమొరీ చిప్‌ల కొరతనే దీనికి కారణంగా చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల తయారీకి మెమొరీ చిప్‌లు అనేది అవసరం. ఇటీవల వీటి ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే చిప్‌ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్‌ఎంసీ) చిప్ ధరలను భారీగా పెంచేందుకు రెడీ అవుతోంది.

వచ్చే ఏడాదిలో ధరలను 10 శాతం మేర పెంచాలని ఆ కంపెనీ చూస్తోంది. ఈ కారణంతో వచ్చే ఏడాదిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఏఐ పరికరాల ధరలు కూడా భారీగా పెరగనున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ధరలు పెరగ్గా.. వచ్చే ఏడాదిలో మరోసారి పెంచేందుకు టెక్ కంపెనీలు సిద్దమవుతున్నాయి.

6 ఎన్‌ఎం కంటే తక్కువ ధర ఉండే చిప్‌లతో పాటు 28ఎన్‌ఎం, 16ఎన్‌ఎం, 12ఎన్‌ఎం చిప్‌ల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సామాన్య ఉద్యోగులకు ఇది భారమనే చెప్పవచ్చు.

ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో చిప్‌ల కొరత ఏర్పడటంతో.. మొబైల్ మెమొరీ విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కంపెనీలు ఫోన్ల ధరల్ని 15 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఫోన్ల అమ్మకాలు కూడా పెరిగిపోయాయి. రూ.15 వేల లోపు ధరల్లో ఉండే ఫోన్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.