
జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు కొనుగోలు చేశారా..? అయితే ఒకసారి వాటిని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బైక్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దాదాపు 2,36,966 బైక్‌లను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. అందులో క్లాసిక్ 350, బుల్లెట్350, మెటియోర్ 350 మోడల్ బైకులు ఉన్నాయి.

ఇండియా, థాయ్ లాండ్, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఈ బైక్‌లు వెనక్కి తీసుకుంటున్నారు. ఇగ్నిషన్ కాయిల్‌లో సమస్యలు తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య వల్ల ఏకంగా ఇంజిన్ మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించిన కంపెనీ.. దాని వల్ల బండి పనితీరులో తేడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్యూట్ కూడా అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది.

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి కావడంతో ఇటీవల తయారు చేసి, మార్కెట్‌లోకి పంపిన లాసిక్ 350, బుల్లెట్350, మెటియోర్ 350 బైకులను వెనక్కి తీసుకుంటున్నారు. గత సంవత్సరం డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య తయారు చేసిన బైక్‌ల్లోనే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించారు. ఈ లెక్కన జనవరి నుంచి ఏప్రిల్ వరకు అమ్మిన వాహనాల్లోనే ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమయంలో అమ్మిన అన్ని వాహనాలకు సమస్య రాదని, కొన్ని వాహనాలకు మాత్రమే సమస్య వస్తుందని చెబుతున్నారు.

ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంస్థ చెబుతోంది. వెనక్కి రప్పించిన వాహనాలను పరిశీలించి అవసరమైన పార్టును రీప్లేస్ చేస్తామని రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది. అయితే పది శాతం వాహనాలకు మాత్రమే ఈ రీప్లేస్‌మెంట్ అవసరమవుతుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్న వాహనాల ఓనర్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ టీమ్ కాంటాక్ట్ అవుతుంది. లేకపోతే వినియోగదారులు కూడా డీలర్ షిప్‌ను కాంటాక్ట్ చేయవచ్చు.

దీని కోసం వెబ్‌సైట్‌లో ఓ హాట్‌లైన్ నెంబరు కూడా ఇచ్చారు. మీరు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్350, మెటియోర్ 350 బైక్‌లు కొనుగోలు చేసినట్లయితే వెంటనే డీలర్‌ను సంప్రదించి చెక్ చేయించుకోండి.