
పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పథకాలు ఉండగా.. కొత్తగా మరికొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది. వీటి ద్వారా అధిక వడ్డీతో పాటు ప్రతీ నెలా ఇన్‌కమ్ పొందవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతీ నెలా మీ అవసరాల కోసం డబ్బులు పొందవచ్చు. అందులో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి.

ఈ స్కీములో ఒకసారి పెట్టుబడి పెడితే.. ప్రతీ నెలా మీ అకౌంట్లో వడ్డీ జమ అవుతుంది. మీరు ప్రతీ నెలా డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి జమ చేస్తే.. వాటిపై ప్రతీ నెలా వడ్డీ అనేది అందుతుంది. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే హాయిగా ప్రతీ నెలా మీ అకౌంట్లోకి డబ్బులు పొందవచ్చు.

ప్రతీ నెలా ఆదాయం కావాలని కోరుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు గృహిణులు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందనేది చెప్పవచ్చు. అందుకే ఈ స్కీములో ఎక్కువమంది చేరుతున్నారు.

కేవలం రూ.వెయ్యితో పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ.9 లక్షలు జమ చేసే అవకాశముండగా.. జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో ముగ్గురు సభ్యులు చేరవచ్చు. ముగ్గురు కలిసి ఖాతాను నిర్వహించవచ్చు.

ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. మీరు రూ.9 లక్షలు ఒకేసారి జమ చేస్తే.. ప్రతీ నెలా రూ.5,550 అందుతుంది. ఇక ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడితో పాటు వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.