
రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం రూపంలో కొంతమొత్తం ప్రతీ ఏడాది అందిస్తూ వస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలవుతుండగా.. దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకంగా ఇది కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది లబ్ది పొందుతున్నారు.

గత నెల జూలై 20వ తేదీన 23వ విడత నగదును ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ అయ్యాయి. దీంతో లబ్ధిదారులు ఇప్పుడు 24వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లపై భూమి ఉంటే ఈ పథకం వర్తిస్తుందా..? భూమి తండ్రీకొడుకులు ఇద్దరి పేర్ల మీద ఉంటే.. వేర్వేరుగా నిధులు పొందవచ్చా? అనే విషయాలు చూద్దాం.

కేంద్ర నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరి పేర్లపై విడివిడిగా భూమి ఉంటే.. ఒక్కరికి మాత్రమే సాయం అందుతుంది. కుమారుడుకి 18 ఏళ్లు దాటి అతని పేరుపై భూమి ఉంటే.. అతను విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే భూమిపై తండ్రీకొడుకుల పేర్లు రెండూ నమోదు అయి ఉంటే.. వారి భూమి వాటాను స్పష్టంగా నిర్ధారించాలి. ఇద్దరికీ వారి వారి వాటాల కోసం వేర్వేరు రాబడి రికార్డులు లేదా LPC ఉండాలి.

ఒకవేళ భూమిని చట్టబద్ధంగా విభజించకుండా.. ఒకే ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే ఇద్దరికీ ఈ పథకం వర్తించదు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా లబ్ది పొందితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విచారణలో బయటపడితే. ఇప్పటివరకు అందుకున్న సొమ్ము మొత్తం వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే మీపై కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల చాలామంది అనర్హులను కేంద్రం జాబితా నుంచి తొలగించింది. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన లబ్దిదారుల జాబితా తనిఖీ చేపడుతున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే తొలగిస్తున్నారు.