
తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే జాగ్రత్త. ఎందుకంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక హెచ్చరిక జారీ చేసింది. తప్పుడు సమాచారంతో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకొని, వాటిని దుర్వినియోగం చేస్తే అదనపు వడ్డీ, జరిమానాలతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుందని EPFO పేర్కొంది.

EPFO ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ పీఎఫ్ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. "తప్పుడు కారణాలు చూపిస్తూ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడం వలన EPF పథకం 1952 కింద రికవరీ పొందవచ్చు. భవిష్యత్తు భద్రత కోసం, సరైన కారణాల కోసం మాత్రమే మీ PF నిధులను ఉపయోగించండి." అని పేర్కొంది.

PF నిధులను ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు? EPF పథకం 1952 ప్రకారం.. EPFO సభ్యులు కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే నిధులను ఉపసంహరించుకోవచ్చు. EPFO ప్రకారం.. వివాహం, పిల్లల విద్య, తీవ్రమైన అనారోగ్యం లేదా ఇంటి కొనుగోలు/నిర్మాణం కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు. మీరు ఈ కారణాలను చూపుతూ PF నిధులను ఉపసంహరించుకొని తరువాత నిధులను వేరే చోట ఉపయోగిస్తే.. ఆ డబ్బును రికవరీ చేసే హక్కు EPFOకు ఉంటుంది.

సెక్షన్ 68B(11) ఏం చెబుతుంది? 1952 EPF పథకంలోని సెక్షన్ 68B(11)లో ఇది స్పష్టంగా ప్రస్తావించబడింది. పీఎఫ్ నిధులు దుర్వినియోగం అయితే ఆ సభ్యుడు మూడేళ్ల పాటు తదుపరి ఉపసంహరణలు చేయకుండా నిషేధించవచ్చు. దుర్వినియోగం చేసిన మొత్తం వడ్డీతో సహా, పూర్తిగా తిరిగి చెల్లించే వరకు కొత్త ముందస్తు చెల్లింపు మంజూరు చేయరు.

ఆటో-సెటిల్మెంట్ పరిమితి రూ.5 లక్షలు.. జూన్ 2025లో EPFO ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది. అందువల్ల ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తి నిజమైన అవసరాలకు మాత్రమే PF నిధులను ఉపసంహరించుకోవడం చాలా ముఖ్యం. ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్తులో గణనీయమైన నష్టాలు, జరిమానాలు విధించవచ్చు.