
ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా డెబిట్ కార్డు ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మీరు ఇంటి వద్ద కార్డు మర్చిపోయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల డెబిట్ కార్డును ఎప్పుడూ మీ పర్సులో క్యారీ చేయాల్సిన పనే లేదు.

యూపీఐ ద్వారా మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏటీఎం మెషీన్‌లో యూపీఐ క్యాష్ విత్ డ్రాయల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎంత తీసుకోవాలనుకుంటున్నారనే అమౌంట్ ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఫోన్‌లో ఏదైనా యూపీఐ యాప్ తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేస్తే చాలు.. ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.

యూపీఐ విధానం ద్వారా మీరు అత్యంత సులువైన పద్దతిలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఏటీఎంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో మీకు నగదు అత్యవసమైనప్పుడు సమీపంలోని ఏటీఎంకు వెళ్లి యూపీఐ పద్దతి ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటును బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఈ ఆప్షన్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా చాలామందికి తెలియదు.

అయితే యూపీఐ విధానం ద్వారా ఎంత కావాలంటే అంత అమౌంట్ తీసుకోలేరు. దీనికి బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. అవేంటంటే.. కేవలం రూ.10 వేల వరకు మాత్రమే తీసుకోవచ్చు. ఆపైన తీసుకోవాలంటే యూపీఐ ఫీచర్ ద్వారా తీసుకోలేరు. చిన్న మొత్తాల్లో విత్ డ్రా చేసుకోవాలంటేనే ఇది యూజ్ అవుతుంది. పెద్ద మొత్తంలో చేయాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిందే.

ఇక ప్రస్తుతం అన్ని బ్యాంకులకు ఇలాంటి ఆప్షన్ లేదు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులు ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే అవకాశముంది. దీంతో ప్యూచర్‌లో అన్ని బ్యాంకుల కస్టమర్ల ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.