
LPG Booking Rules: గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు కీలక మార్పులు ప్రకటించాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్న కుటుంబాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరగవచ్చని భావించి, ముందస్తు జాగ్రత్తగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

రెండు సిలిండర్లు ఉన్నవారు ఒకటి బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 35 రోజులు వేచి ఉండాల్సి ఉండాలని, అదే ఉజ్వల యోజన లబ్దిదారులకు ఈ గ్యాప్‌ను 45 రోజులకు పెంచినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఒకే ఒక సిలిండర్ ఉన్నవారికి మాత్రం పాత విధానమే కొనసాగుతుందంటూ వైరల్ అవుతుండగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది నిజం కాదని స్పష్టం చేసింది.

బుకింగ్‌కు కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి కేటాయించిన 12 సిలిండర్ల కోటా పూర్తయితే అదనంగా బుక్ చేయాలంటే యాప్‌లో కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో సభ్యుల సంఖ్య, ప్రత్యేక కార్యక్రమాలు (శుభకార్యాలు), అతిథుల రాక వంటి వివరాలు ఇవ్వడం తప్పనిసరి అంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి.

ఇక డెలివరీ సమయంలో OTP నిర్ధారణ తప్పనిసరి అవసరం. e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. లేదంటే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ పూర్తయ్యిందా ? లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతకు ప్రధాన కారణం పుకార్లు, ముందస్తు నిల్వలే అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందకుండా, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయకుండా ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు.