కరోనా కారణంగా ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్ సోకితే చికిత్స చేసుకునేందుకు సైతం డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మంది కోవిడ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కోవిడ్ పాలసీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి.
అయితే తాజాగా ట్రాక్టర్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తమ వినియోగదారులకు కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఎం-ప్రొటెక్ట్ కోవిడ్ పేరుతో ప్రస్తుతం కరోనా సమయంలో కస్టమర్లకు అండగా ఉండేందుకు ఆ ప్లాన్‌ను ప్రకటించింది.
2021 మే నెలలో ట్రాక్టర్లను కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల వరకు కవరేజీ ఉండే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తోంది. మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఈ ఇన్సూరెన్స్ అందించనుందని కంపెనీ తెలిపింది. అంతే కాదు ప్రీ అఫ్రూవ్డ్ లోన్లను కూడా ఇస్తామని తెలిపింది. ఈ కొత్త పాలసీతో కంపెనీ కస్టమర్లను, వారి కుటుంబాలను కరోనా నుంచి కాపాడుతామని మహీంద్రా కంపెనీ తన స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది.
కరోనా కాలంలో ఈ ఆఫర్ ప్రకటించడం హర్షనీయమని కస్టమర్లు చెబుతున్నారు. మే నెలలో కొనుగోలు చేసిన అన్ని వేరియంట్ల ట్రాక్టర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.