
బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ఊహించనంత స్థాయిలో పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పండుగల సీజన్ కావడంతో పసిడికి డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో సంక్రాంతి ఉండటంతో బంగారం ధరలు పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బంగారంకు పోటీగా తగ్గేదేలే అన్నట్లు వెండి ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం కేజీ వెండి మూడు లక్షల మార్క్ వరకు చేరుకుని ఆల్ టైం రికార్డును వెండి నమోదు చేసింది. ప్రస్తుతం రూ.2 లక్షల 80 వేల దగ్గర ఊగిసలాడుతోంది. వెండి ధరలు రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతాయోననే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో దీనిపై రిచ్ డాడ్ పూర్ డాడా రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. సిల్వర్ ధర ఎంత పెరుగుతుందనేది ఓ అంచనా వేశారు

వెండి త్వరలోనే 200 డాలర్లకు చేరుతుందని కియోసాకి తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే 80 డాలర్లకు చేరుకుందన్న ఆయన.. త్వరలోనే 200 డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుండటం చూస్తే కియోసాకి మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

బంగారం, వెండి అసలైన ఆస్తులని కియోసాకి ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. వాటిపై పెట్టుబడులు పెడితే మంచి రాబడి వస్తుందని కూడా సూచించారు. తాను కూడా వాటిపై ఇన్వెస్టమెంట్స్ భారీగా చేస్తున్నట్లు గతంలో తెలిపారు. ఇప్పుడు వెండి ధరలు ఆమాంతం రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న క్రమంలో కియోసాకి మరోసారి స్పందించడం గమనార్హం.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రూ.2.81 లక్షల దగ్గర కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబైలో మాత్రం రూ.2.58 లక్షల దగ్గర ఉంది. ఈ రోజు ట్రేండింగ్‌లో ఏకంగా రూ.21 వేల వరకు పడిపోగా.. రేపటి నుంచి తగ్గని ధరలు అమల్లోకి రానున్నాయి. అటు బంగారం ధరలు రూ.లక్షా 40 వేల వద్ద కొనసాగుతున్నాయి.