బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతాయి. తాజాగా మార్చి 14న బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి కూడా అదే బాటలో వెళుతోంది. ఈ ధరలు రాత్రి 9 గంటల సమయానికి నమోదైనవి మాత్రమే. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 11,00 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్లపై రూ.1200 వరకు ఎగబాకింది.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,300 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.89,780 వద్ద కొనసాగుతోంది. అంటే రూ.90 వేల చేరువలో ఉంది. రానున్న రోజుట్లో లక్ష రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధర కిలోపై ఏకంగా రూ.2000 వరకు పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.1,03,000 ఉండగా, చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో రూ.1,12,000 వరకు ఉంది.
ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెరగడం ఈ ర్యాలీకి కారణమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, యూరోపియన్ దిగుమతులపై 200% సుంకాలు విధించాలనే ట్రంప్ నిర్ణయం కారణం కావచ్చు. గత సంవత్సరం కాలంగా ప్రపంచ ఆర్థిక అస్థిరత, కేంద్ర బ్యాంకులు డాలర్ ఆధారిత నిల్వల నుండి దూరంగా ఉండటం వలన బంగారం డిమాండ్ పెరిగింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకున్నాయి. 2024 లో పోలాండ్, టర్కియే, భారతదేశం అతిపెద్ద కొనుగోలుదారులు. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ప్రపంచవ్యాప్త డిమాండ్, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ సంఘటనలు వంటి అంశాలు వాటి విలువను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24 మించకూడదు. అలాగే క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుంది.