
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, ఉద్రిక్త పరిస్థితులు, ఆర్ధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల వల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాటి ధరలు రికార్డు స్థాయిలో గత రెండేళ్లుగా పెరుగుతున్నాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి

ఎక్సైజ్ సుంకాలు, ట్యాక్సులను బట్టి దేశాల వారీగా గోల్డ్ రేట్లు మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ధరలు స్వల్పంగా పెరగ్గా.. మరికొన్ని దేశాల్లో అధికంగా ఉన్నాయి. దాయాది దేశమైన పాకిస్తాన్‌లో బంగారం రేట్లు మరీ అధికంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్ధికంగా సంక్షోభంలో కూరుకుపోగా.. ఆ దేశ కరెన్సీ విలువ కూడా పాతాళంలోకి పడిపోయింది. దీంతో పాక్‌లో బంగారం ధరలు దారుణంగా పెరిగిపోయాయి. దీంతో ఆ దేశ ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

పాక్‌లో 11.66 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,65,500 పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 4,26,800 పలుకుతోంది. దీని లెక్కన 20 గ్రాముల(రెండు తులాలు) 22 క్యారెట్ల నెక్లెస్ కొనాలంటే 8.5 లక్షల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక డిజైన్, మేకింగ్, ఇతర ఛార్జీలు కలుపుకుంటే 9 లక్షలు అవుతుంది. దీంతో పాక్ ప్రజలకు బంగారం అంటేనే అది ఒక పెద్ద లగ్జరీ వస్తువుగా మారిపోయింది.

పాక్ మార్కెట్లో అస్ధిరత, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, దిగుమతి ఖర్చులు, ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోవడం దీనికి కారణాలుగా చెప్పవచ్చు. దీంతో అక్కడి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అయితే పాక్‌తో పోలిస్తే భారత్‌లో బంగారం ధరలు స్వల్పంగానే పెరిగాయి. భారత్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.60 లక్షలుగా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1.45 లక్షలుగా ఉంది. 20 గ్రామలు బంగారంతో ఒక హారం తయారికి రూ.3 లక్షల వరకు అవుతుంది.

మేకింగ్ ఛార్జీలు, తరుగు అన్నీ కలుపుతున్నా రూ.3.5 లక్షలకు ఒక హారం వస్తుంది. అదే పాకిస్తాన్‌లో అయితే రూ.9 లక్షలు అవుతుంది. పాక్‌తో పోలిస్తే భారత్‌లో గోల్డ్ రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహారణ. అటు భారత్‌లో వెండి ధరలు రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.