
ఈపీఎఫ్‌వో ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఎఫ్ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు పెంపుపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన కేంద్ర ఉపాధి, కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉందని, పెంపుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

త్వరలోనే పెన్షన్ పరిమితి పెంపుపై కీలక నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో పెన్షన్ పెంపుపై పీఎఫ్ ఖాతాదారులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కనీన పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. దానిని రూ.7,500కి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద కనీస పింఛన్‌ను గణనీయంగా పెంచాలని కేంద్రం యోచిస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్రం చూస్తోంది.

ప్రాధమిక అవసరాలకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ సరిపోవడం లేదని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యా్ప్తంగా ఆందోళనలు కూడా పలుమార్లు నిర్వహించారు. ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు పలికింది. దీంతో అప్పటినుంచి పెన్షన్ పెంపు వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇలా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.

పెన్షన్ పరిమితి పెంచితే.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా పొందే పెన్షన్ అమౌంట్ పెరుగుతుంది. ఈ పెరుగుదల రోజువారీ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇక ఈపీఎఫ్‌వో నిధుల లభ్యతను సులభతరం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.

అలాగే ఈపీఎఫ్‌వో బేసిక్ శాలరీ లిమిట్ కూడా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉండగా.. దీనిని రూ.30 వేలుగా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని వల్ల ఎక్కువమంది పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. త్వరలో దీనిపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి కేంద్రం నుంచి త్వరలో ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాలి.