
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఐదు రోజుల పాటు నిలిచిపోయిన ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ సర్వీసులు జులై 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా తాత్కాలికంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్ లో పీఎఫ్ డిజిటల్ సేవలను నిలిపివేసింది. జూన్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిలిపివేసింది. అనంతరం జూలై 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్ గ్రేడ్ చేసేందుకు క్లెయిమ్ సమర్పణ, పాస్‌బుక్ డౌన్‌లోడ్‌లతో సహా అనేక సేవలను నిలిపివేసింది. అప్ గ్రేడ్ పూర్తవ్వడంతో నేటి నుంచి యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్ లో తిరిగి సేవలు ప్రారంభం కానున్నాయి. అప్ గ్రేడ్ చేయబడిన ప్లాట్‌ఫారమ్ వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన సేవలను అందించనుంది. సాంకేతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు, 7 కోట్లకు పైగా సభ్యుల వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈపీఎఫ్ఓ సిస్టమ్ అప్ గ్రేడ్ చేసింది.

జూన్ 30న మైగ్రేషన్ ముగియడంతో.. జూలై 1 నుండి డిజిటల్ సేవలను తిరిగి పొందవచ్చు. తాత్కాలిక షట్‌డౌన్ కారణంగా క్లెయిమ్‌లు దాఖలు చేయడం లేదా పాస్‌బుక్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం వంటివి ఖాతాదారులు వాయిదా వేసుకున్నారు. అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి రానుండటంతో యథావిధిగా సేవలు పొందవచ్చు. తమ ఆన్‌లైన్ సేవల వేగం, విశ్వసనీయత, భద్రతను మెరుగుపరచడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని ఈపీఎఫ్ఓ చెబుతోంది.

సిస్టమ్ అప్ గ్రేడ్ అవ్వడంతో క్లెయిమ్స్ మరింత వేగవంతం కానున్నాయి. మాన్యువల్ అవసరం లేకుండా ఆటోమేషన్ పద్దతిలో క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. రూ.5 లక్షలలోపు క్లెయిమ్స్ ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తారు. దీంతో మూడు రోజుల్లోనే పీఎఫ్ నగదు పొందవచ్చు. అంతేకాకుండా ఎలాంటి పత్రాలు కూడా అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

జులై 1 అర్ధరాత్రి నాటికి సేవలు పూర్తిగా పునరుద్ధరించబడతాయని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. వేగవంతమైన, విశ్వసనీయమైన, మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఈ ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక అసౌకర్యానికి EPFO చింతిస్తోందని, మీ సహనాన్ని అభినందిస్తోందని ఈపీఎఫ్ఓ పేర్కొంది.