
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద.. పెరిగిన పెన్షన్ కోసం అభ్యర్థనలను సమర్పించడానికి గడువును మే 3 వరకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గడువు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువు పొడగింపు ప్రక్రియ రేపటితో ముగియనుంది. దీంతో ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవ్వడం.. ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ సర్వర్ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగించాలని పింఛనుదారులు ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈపీఎఫ్‌వో పింఛను విభాగం ఉన్నతాధికారులు శిక్షణలో ఉండటంతో గడువుపై సరైన నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు పేర్కొన్నాయి.

2014కు ముందు సర్వీసులో చేరి, ఆ తరువాత కొనసాగుతూ వాస్తవిక వేతనం (ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకన్నా ఎక్కువ) పై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరిలో మార్గదర్శకాలు జారీ చేసిన ఈపీఎఫ్‌వో.. మే 3వ తేదీలోగా ఆన్‌లైన్లో ఉమ్మడి ఆప్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

అధిక పింఛను దరఖాస్తులో కీలకమైన పేరా 26(6) కింద వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్‌వో అనుమతి పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని యాజమాన్యాల నుంచి తీసుకునేందుకు ఉద్యోగులకు జాప్యం జరిగింది. ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌ను కచ్చితంగా దరఖాస్తుతో పాటు జతచేయాల్సి రావడం.. ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ సర్వర్ పనిచేయకపోవడం తీవ్ర జాప్యం జరిగింది.

అయితే, ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుకు 4 నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది. ఈపీఎఫ్‌వో మాత్రం 2 నెలలే గడువు ఇవ్వడంతో, మరో 2 నెలల గడువు ఇవ్వాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.