
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ-కేవైసీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోపు గ్యా్స్ సిలిండర్లు వాడేవారందరూ తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటిలోగా పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేయనున్నట్ల తెలిపింది. నిజమైన లబ్దిదారుడికి మాత్రమే సబ్సిడీ అందించాలనే ఉద్దేశంతో అక్రమంగా డబ్బు పొందుతున్నవారిని నివారించేందుకు కేంద్రం కేవైసీ నిబంధనను తప్పనిసరి చేసింది

ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే కేవలం సబ్సిడీ నిధులు మాత్రమే నిలిచిపోతాయి. గ్యాస్ బుకింగ్ యథావిధిగా చేసుకోవచ్చు. కేవైసీ పూర్తి చేయలేదనే నెపంతో గ్యాస్ బుకింగ్, డెలివరీలు అపవద్దని ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. అయితే కేవైసీ పూర్తి చూసేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సిలిండర్ డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ మెషిన్లు ఉంటాయి. దాని ఆధారంగా కేవైసీ పూర్తి చేయొచ్చు.

ఇక సమీపంలోని మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీ వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఐరిస్ సమాచారంతో కేవైసీ పూర్తవుతుంది. ఇక మీ గ్యాస్ కంపెనీ యాప్, వెబ్ సైట్ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కేవైసీ పూర్తి చేయవచ్చు. అయితే ఇప్పటికే కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్లీ అవసరం లేదు.

ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి కేవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి. అప్పుడే సబ్సిడీ సొమ్ము అకౌంట్లో నేరుగా పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సబ్సిడీ కట్ అవుతుంది. మళ్లీ కేవైసీ చేయించుకుంటేనే రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. అయితే కేవైసీ పూర్తి చేయలేదనే కారణంతో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు బుకింగ్, డెలివరీలను ఆపేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

ఈ క్రమంలో కేంద్రం స్పందించి గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ బుకింగ్స్‌ను ఆపడం నిబంధనలకు విరుద్దమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద లబ్ది పొందుతున్నవారు కేవైసీ పూర్తి చేయకపోతే రూ.300 సబ్సిడీ ఇక రాదు.