
కేంద్ర ప్రభుత్వం "ఒక ఇంటికి, ఒక గ్యాస్ కనెక్షన్" అనే నిబంధన తీసుకొచ్చింది. ఒక కుటుంబం ఒకే గ్యా్స్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఎల్పీజీ లేదా పీఎన్‌జీలలో ఏదైనా ఒకటి మాత్రమే ఉండాలి. పైప్డ్ నేచురల్ గ్యాస్ లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలకు పీఎన్‌జీలోకి మారేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్‌లను తొలగించడం, ప్రభుత్వ సబ్సిడీల దుర్వినియోగాన్ని నివారించడం, ప్రయోజనాలు కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చూడటంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ద్వంద్వ గ్యాస్ కనెక్షన్ల పద్ధతిని పూర్తిగా తొలగించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వినియోగదారుడు తమ ఇంట్లో కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకుంటే 30 రోజుల్లోగా ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాలి. జూన్ 1వ తేదీన PNG లైన్ వచ్చిందని అనుకుంటే.. ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ జూన్ 30వ తేదీలోగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి తిరిగి ఇచ్చివేయాలి. వినియోగదారుడు అనవసరంగా ద్వంద్వ కనెక్షన్‌ను దుర్వినియోగం చేయకుండా నిర్ధారించేందుకు ఇది సహాయపడుతుంది.

ఇప్పటికే పీఎన్‌జీ పైప్‌లైన్‌లు అందుబాటులో ఉండి గ్యాస్ సరఫరా సజావుగా సాగుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు నిబంధనలు వేరుగా ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఉంటూ ఇంకా పీఎన్‌జీ కనెక్షన్ పొందని వినియోగదారులకు కేంద్రం 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీలు కూడా వినియోగదారులకు నోటీసులు పంపడం ప్రారంభించాయి. ఈ 90 రోజుల నోటీసు గడువు తర్వాత కూడా వినియోగదారుడు పీఎన్‌జీ నెట్‌వర్క్‌కు మారకపోతే ప్రస్తుత ఎల్పీజీ కనెక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

అయితే పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఇంకా చేరని గ్రామీణ ప్రాంతాలు లేదా పట్టణ కాలనీలలో నివసిస్తున్న వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా పాత నిబంధనల ప్రకారమే కొనసాగుతుంది. ఈ వినియోగదారులపై 30 లేదా 90 రోజుల గడువు ప్రభావం చూపదు. మెట్రోలు, పెద్ద నగరాల్లో పీఎన్‌జీ వంటి స్వచ్ఛమైన ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడం, గ్యాస్ సిలిండర్ల భారమైన రవాణాను తొలగించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది

పీఎన్‌జీ పైప్‌లైన్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో 30 రోజులు, 90 రోజుల నిబంధనల గురించి ప్రతీఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరముంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలిగిన క్రమంలో కేంద్రం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.