
ఈపీఎఫ్ ఖాతాదారులకు స్పష్టతిచ్చేలా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పీఎఫ్ వడ్డీ రేట్లను త్వరలో కేంద్రం పెంచనుందని, 10 శాతానికి పెంచేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని, కార్మిక సంఘాలు దీనిపై ప్రతిపాదనలు కూడా పంపాయని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై పార్లమెంట్ సభ్యుడు విజయ్ వసంత్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఈపీఎఫ్ వడ్డీ రేట్లను 10 శాతానికి పెంచనున్నారా? కేంద్ర దీని గురించి ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దీంతో దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి శోభా కరంద్లేజ్ సమాధానమిచ్చారు. పీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, ఈపీఎఫ్‌కు పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయన్ని బట్టి వడ్డీని నిర్ణయిస్తారని శోభా కరంద్లేజ్ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ కార్పస్‌కు పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

ఇష్టానుసారం వడ్డీ రేట్లను నిర్ణయించడానిక వీల్లేదని, పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్‌ను బట్టి వడ్డీ రేట్లను ఫిక్స్ చేస్తారని శోభా కరంద్లేజ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో్ పీఎఫ్ వడ్డీ రేట్లను 10 శాతానికి పెంచడం సాధ్యం కాదని, ఆదాయానికి మించి అధిక వడ్డీ రేటును అందించే అవకాశం లేదన్నారు. రిటర్న్స్ లేకుండా అధిక వడ్డీ అందిస్తే మూలధనాన్ని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు.

ఇష్ట ప్రకారం వడ్డీలు పెంచడం కుదరదని, ఈపీఎఫ్ పథకం దీర్ఘకాలంలో కొనసాగాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వ్యవస్థలో పొందుపర్చిన నిబంధనల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారన్నారు. ఉద్యోగుల ప్రతినిధులు, యజమానులు, ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. నిర్ణయాలు సమిష్టిగా ఉంటాయని పేర్కొన్నారు.

వడ్డీ రేట్లను నిర్ణయించే ప్రక్రియలో భాగస్వామ్యులందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని శోభా కరంద్లేజ్ అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈపీఎఫ్ కలిసి వడ్డీ రేట్లను కేంద్రానికి సిఫార్సు చేస్తాయని, కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం వీటిని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ప్రతీ ఏడాది మార్చిలోగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు.