
Car prices: కార్ల తయారీ సంస్థలు వచ్చే ఏడాదిలో ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీతో పాటు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన మెర్సిడెజ్ బెంజ్, ఆడీ సైతం 2022 జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

వాహన ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం ఒక కారణం అయితే.. కార్లకు మరిన్ని ఫీచర్స్ జోడించడం వల్ల ఖర్చు పెరిగిపోయిందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నాయి.

మోడల్‌ను బట్టి ధర పెరుగుదల ఉంటుందని మారుతి సుజుకీ స్పష్టం చేస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై వచ్చే జనవరి ఒకటి నుంచి 2 శాతం వరకు ధర పెరగనున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ పేర్కొంది.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల రేటును 3 శాతం వరకు పెంచుతున్నట్లు ఆడీ వెల్లడించింది. వాహనాల్లో ఉపయోగించే ముడి సరుకులైన స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల ధరలు గడిచిన ఏడాదికాలంలో గణనీయంగా పెరుగుతూ వచ్చాయని, దాంతో వాహన ధరలను పలుమార్లు పెంచాల్సి వచ్చిందని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.