
చర్మ సౌందర్యానికి..: వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు చర్మంపై ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, జిడ్డు చర్మ సమస్యలకు వేప నీరు చక్కటి పరిష్కారం. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా వేప నీటిని వాడటం వల్ల త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా ఆటలమ్మ సోకినప్పుడు చర్మంపై వచ్చే మంటను, దురదను తగ్గించడానికి వైద్యులు సైతం వేప ఆకులనే సూచిస్తారు.

జుట్టు సంరక్షణలో వేప మ్యాజిక్: నేటి కాలుష్యం కారణంగా చాలామంది చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వేప నీటితో తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ శుభ్రపడి, చుండ్రును కలిగించే ఫంగస్ నశిస్తుంది. రసాయన షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా మారినప్పుడు, వేప నీరు కండిషనర్‌లా పనిచేసి జుట్టుకు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది.

శరీర దుర్వాసనకు చెక్: ఎండలు మండిపోతున్న వేళ చెమట పట్టడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల చంకలు, పాదాల వంటి భాగాల్లో దుర్వాసన వస్తుంది. వేప నీటిలోని క్రిమిసంహారక గుణాలు ఈ బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేస్తాయి. రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచడమే కాకుండా చెమట కాయలు రాకుండా అరికడుతుంది.

కంటి ఆరోగ్యానికి రక్షక కవచం: కళ్లు శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు. కలుషిత గాలి లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కళ్లు ఎర్రబడటం, కండ్లకలక వంటి సమస్యలు వస్తుంటాయి. వేప నీటిని చల్లార్చి కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కంటి మంటల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాగా ఆయుర్వేదంలో వేపను "సర్వరోగ నివారిణి" అని పిలుస్తారు. కేవలం స్నానానికే కాకుండా వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వ్యాధులు రావు. వేప నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి?: గుప్పెడు తాజా వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఒక లీటరు నీటిలో ఈ ఆకులను వేసి, నీరు సగం అయ్యే వరకు లేదా ఆకు పచ్చ రంగులోకి మారే వరకు బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి, మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఖరీదైన కాస్మెటిక్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, మన పెరట్లో దొరికే వేపతో సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రకృతికి దగ్గరగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం