ప్రస్తుతం ఆయిల్ స్కిన్ సమస్య సర్వసాధారణం. విపరీతమైన చెమట లేదా చర్మంలో జిడ్డు విడుదల అవడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. మీ చర్మం జిడ్డుగా ఉంటే మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను బారిన పడతారు. చాలా సార్లు చర్మం.. అదనపు నూనె, నెయ్యి లేదా మసాలా ఆహారం లేదా వాతావరణం మారినప్పుడు జిడ్డుగా మారుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముఖం కడుక్కున్న 1 గంటలోపు చర్మం మెరిసిపోతుంది. జిడ్డుగల చర్మం కలిగిన వారు రోజుకు కనీసం 2 సార్లు ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం లోపల నూనెను సేకరించే రంధ్రాలు ఓపెన్ అవుతాయి. లేదంటే చర్మంలో నూనె పేరుకుంటే.. మొటిమలు , ఇతర చర్మ సమస్యలు తీవ్రమవుతాయి
జిడ్డు చర్మం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఒత్తిడికి గురికావడం, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పటికప్పుడు హార్మోన్లలో మార్పులు మొదలైనవి దీనికి కారణాలు. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి ఇంట్లోనే అనేక మార్గాలను అనుసరించవచ్చు.
గుడ్డు తెల్లసొన: గుడ్డు తెల్లసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యను పరిష్కరిస్తుంది. గుడ్డులో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసేందుకు పేస్ట్ లా చేసుకోవాలి. ఇది ముఖంలోని అదనపు జిడ్డును తొలగించి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
పెరుగు: పెరుగు ముఖంపై అదనపు నూనెను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మీ ముఖానికి పెరుగును అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
బంగాళదుంప: బంగాళదుంప రసం తీసి ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. లేదా బంగాళదుంపను గ్రైండ్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి.
తేనె: తేనెలో యాంటీ బాక్టీరియల్ , యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. దీనిని మొటిమలు, ఇతర జిడ్డుగల చర్మ సమస్యలను నివారించడానికి ఉపయోగించవచ్చు. మీ ముఖం మీద తేనెని పలుచని పొరగా వేసుకోండి. 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తేనే ప్యాక్ వేసుకోవడం వలన జిడ్డు చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
వేప: వేల సంవత్సరాలుగా, వేప జిడ్డు చర్మం వల్ల వచ్చే మొటిమలను నయం చేసే సహజమైన ఔషధం. వారానికోసారి వేప ఆకులను పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు నయమవుతాయి.
దోసకాయ: దోసకాయను రెగ్యులర్ గా ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం సమస్య తగ్గుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి శుభ్రపరుస్తుంది.
అలోవెరా: కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలబందను రోజూ లేదా వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది. కలబంద చర్మంలోని జిడ్డును గ్రహించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ సంరక్షణ చేస్తుంది.