
ఒక సాధారణ అరటి పండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6, సి పుష్కలంగా లభిస్తాయి. అరటిపండ్లతో పోలిస్తే ఖర్జూరాలలో కేలరీలు ఎక్కువ. కేవలం మూడు లేదా నాలుగు ఖర్జూరాలు తింటే చాలు.. మీకు 90 నుండి 120 కేలరీల శక్తి వస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.

నిరంతర శక్తి కావాలా?: మీరు ఎక్కువ సేపు వ్యాయామం చేయాలన్నా లేదా రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా అరటి పండ్లు ఉత్తమం. వీటిలోని ఫైబర్ చక్కెరను రక్తంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల మీకు ఎక్కువ సేపు శక్తి అందుతుంది.

తక్షణ శక్తి కావాలా?: బాగా అలసిపోయినప్పుడు లేదా కఠినమైన వర్కవుట్ తర్వాత నీరసంగా అనిపిస్తే ఖర్జూరాలు బెస్ట్ ఛాయిస్. వీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణమే గ్లూకోజ్ అందుతుంది. అందుకే ఉపవాసాలు విరమించేటప్పుడు ఖర్జూరాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ఖర్జూరాలలో సహజ సిద్ధమైన తీపి అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవారు ఖర్జూరాల పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. పండ్లు షుగర్ పేషెంట్లకు కొంత మేర సురక్షితం.

మీరు కండరాల తిమ్మిరితో ఇబ్బంది పడుతుంటే పండ్లలోని పొటాషియం మేలు చేస్తుంది. అదే సమయంలో వర్కవుట్ తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఖర్జూరాల్లోని మెగ్నీషియం అద్భుతంగా పనిచేస్తుంది.

ఏది మంచిది అంటే.. మీ శరీర అవసరాలను బట్టి రెండూ మంచివే. ఎక్కువ సేపు పని చేయాలనుకుంటే పండు తినండి, వెంటనే హుషారు కావాలంటే ఖర్జూరం ఎంచుకోండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.