
అరటిపండ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం శరీర కండరాలను బలోపేతం చేస్తాయి. ఇవి శక్తిని అందించడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. అరటిపండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఉదయం లేదా భోజనం తర్వాత బొప్పాయి తినడం మంచిది. అల్పాహారంలో స్మూతీ, సలాడ్ లేదా జ్యూస్‌గా బొప్పాయిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. భోజనం తర్వాత కొద్దిసేపటికే బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది.

ఎందుకు కలిపి తినకూడదు? : అరటిపండు - బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి కలయిక వల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావచ్చని చెబుతున్నారు.

ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండు శరీరానికి చలువ చేస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా తలనొప్పి, వాంతులు, తలతిరుగుడు, అలెర్జీలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

అంతేకాకుండా కామెర్లు ఉన్నవారు బొప్పాయి తినకూడదు. ఇందులో ఉండే పపైన్, బీటా కెరోటిన్ కామెర్ల సమస్యను పెంచుతాయని వైద్యులు తెలిపారు. అలాగే శరీరంలో పొటాషియం అధికంగా ఉన్నవారు అరటిపండ్లు తినకుండా ఉండడం మంచిది. కాబట్టి ఈ పండ్లను కలిపి తినకుండా విడివిడిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.