
పచ్చళ్లు అనగానే భోజన ప్రియులకు నోరు ఊరుతుంది. ఇది ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో విరివిగా తయారుచేసే సంప్రదాయ వంటకం. పచ్చిమిర్చి పచ్చడి కారంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, ఈ ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తే అది కారం కన్నా రుచికరంగా, కమ్మగా ఉండి మీ ఆకలిని పెంచుతుంది. వేడివేడిగా వండిన అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. టిఫిన్స్‌తో పాటు కూడా ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది.

కావాల్సిన పదార్థాలు.. పచ్చిమిర్చి 200 గ్రాములు (లేత ఆకుపచ్చ, లావుగా ఉండేవి), చింతపండు మీడియం నిమ్మకాయ సైజు అంత, నూనె 2 టీస్పూన్లు (వేయించడానికి) 1-2 టేబుల్ స్పూన్లు (పోపు కోసం), మెంతులు 1/2 టీస్పూన్, ధనియాలు 2 టీస్పూన్లు, జీలకర్ర 1/2 టీస్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5-6, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లిపాయ 1 మీడియం సైజు (ముక్కలుగా తరిగినవి), పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు), ఇంగువ 1/4 టీస్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1/4 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా (ఐచ్ఛికం) చొప్పున తీసుకోవాలి.

ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండును ఒక గిన్నెలో తీసుకొని, చింతపండు మునిగే వరకు నీరు పోసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ పచ్చడికి లేత ఆకుపచ్చ రంగులో, కొద్దిగా బొంతల్లాగా (లావుగా) ఉండే పచ్చిమిర్చిని ఎంచుకోవాలి. ఇవి కారం తక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉండేందుకు కాడలను తుంచి పెట్టుకోవాలి.ఒక పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, 1/2 టీస్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించాలి. మెంతులు బాగా వేగకపోతే చేదు వస్తుంది. మెంతులు వేగిన తర్వాత రెండు టీస్పూన్ల ధనియాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. వేయించిన మసాలా దినుసులను తీసి పక్కన పెట్టుకుని, అదే పాన్‌లో తుంచిపెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఒకసారి కలిపి మూతపెట్టి, మధ్యమధ్యలో మూత తీస్తూ, కలుపుతూ పచ్చిమిర్చి మెత్తబడే వరకు వేయించాలి. నువ్వులు మాడిపోకుండా ఉండాలంటే, వాటిని పచ్చిమిర్చితో కాకుండా విడిగా వేయించుకోవచ్చు.

పచ్చిమిర్చి, మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. నానబెట్టిన చింతపండు, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, చింతపండు నానబెట్టిన నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తటి పేస్ట్ చేయకూడదు. రోటి పచ్చడిలా పలుకుగా ఉండేలా చూసుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చడిలో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి, రెండుసార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు పంటికి తగిలేలా కచ్చాపచ్చాగా ఉండాలి.

ఒక చిన్న పాన్‌లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) వేయాలి. ఆవాలు చిటపటలాడాక 1/4 టీస్పూన్ ఇంగువ, తుంచిన రెండు ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఈ వేడి పోపును సిద్ధంగా ఉంచుకున్న పచ్చడిలో వేసి బాగా కలపాలి. కావాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా కలుపుకోవచ్చు. అంతే రుచికరమైన కోస్తా ఆంధ్ర పచ్చిమిర్చి పచ్చడి సిద్ధం. వేడివేడి అన్నంతో నెయ్యితో కలిపి లేదా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌లో ఆస్వాదించండి. పుల్లపుల్లగా, కారం కారంగా ఉండే ఈ పచ్చడి మీ భోజనానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది.