
మినుముల జావకు కావాల్సిన పదార్థాలు : పావు కప్పు మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం , పావు టీ స్పూన్ మెంతులు, నాలుగు యాలకలు, అర కప్పు బెల్లం తురుము, సరిపడా నీరు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము , చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ సొంఠి పొడిని తీసుకోవాలి.

మినుముల జావ తయారీ విధానం: ముందుగా పావు కప్పు మినపప్పును తీసుకుని లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. మంచి సువాసన వచ్చి, రంగు మారేవరకు వేయించాలి. ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాలు వరకు పడుతుంది. ఇంకా దీనిని మట్టి పాత్రలో వేయించినట్లయితే, పదిహేను నిమిషాల పైనే పడుతుంది. మినపప్పు దొరకని వారు పొట్టు లేని మినపగుళ్ళు తీసుకోవచ్చు.

కానీ పొట్టుతో ఉన్న మినపప్పు జావకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ మినపప్పు నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ బియ్యం, పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి, అవి కూడా మంచి సువాసన వచ్చేవరకు సన్నని మంట మీదే వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మంటను తక్కువగా ఉంచాలి. వేయించిన మినపప్పు, బియ్యం, మెంతుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, తగినంత నీరు పోసి కనీసం నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, అందులో నాలుగు యాలకలు చేర్చి, తగినన్ని నీళ్ళు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.

అర కప్పు బెల్లం తురుములో అర కప్పు నీరు పోసి, బెల్లం కరిగే వరకు మాత్రమే వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత, దానిని వడకట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి.ఇప్పుడు ఒక లీటరు నీటిని తీసుకుని మరిగించాలి. నీరు వేడెక్కుతున్నప్పుడు, గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్‌ను ఒకేసారి కాకుండా, కొద్దీ కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా జావ ఉంటుంది. మినపప్పు పేస్ట్ పోసిన తర్వాత, నిదానంగా కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించాలి. మరీ ఎక్కువగా చిక్కబరచకూడదు, లేదంటే చల్లారిన తర్వాత జావ పేస్ట్ లాగా మారిపోతుంది. సరైన చిక్కదనాన్ని గుర్తించడానికి, గరిటెను తిప్పుతూ ఉంచాలి.

జావ సరైన చిక్కదనానికి వచ్చాక, వడకట్టిన బెల్లం పాకాన్ని అందులో కలపాలి. తరువాత పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచిని సమతుల్యం చేయడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కావాలంటే, పావు టీ స్పూన్ సొంఠి పొడిని కూడా చేర్చుకోవచ్చు, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ పదార్థాలన్నీ వేసిన ఒక్క నిమిషం పాటు మరిగించి దింపేయాలి.