
హిందువుల అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లోనే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే బాబా బర్ఫానీ (మంచు శివలింగం) కేవలం ఐదు రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.

హిమగిరుల్లో నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) ప్రభావం ఈసారి అమర్‌నాథ్ మంచు లింగంపై తీవ్రంగా పడింది. దీనికి తోడు, యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడం, వారి శ్వాసక్రియ వల్ల వెలువడే వేడి కారణంగా మంచు లింగం చాలా త్వరగా కరిగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు.

గుహ లోపలికి వెళ్ళే నీరు గడ్డ కట్టే పరిస్థితులు లేకపోవడంతో మంచు లింగం స్థానం లో ప్రస్తుతం త్రిశూల వేదిక మాత్రమే ఉంది...మంచు లింగం కరిగిపోయినప్పటికీ, ఆ పవిత్ర స్థలం పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం ,భక్తి ఏమాత్రం తగ్గలేదు. మంచు రూపం లేకపోయినా పవిత్ర గుహను దర్శించుకునేందుకు వేలాది మంది తేలివస్తున్నారు..ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,13,000 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు.. భం భం భోలే, హర హర మహాదేవ్ స్మరణలతో అమర్‌నాథ్ మార్గాలైన పహల్గామ్, బాల్తాల్ ప్రాంతాలు మారుమోగుతున్నాయి.

రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు..ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ ఏడాది దర్శనాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే 4 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్టర్ చేసుకోగా, ఆఫ్-లైన్ (కరెంట్ రిజిస్ట్రేషన్) కౌంటర్ల ద్వారా కూడా ప్రతిరోజూ వేలాది మంది టోకెన్లు పొంది యాత్రకు బయలుదేరుతున్నారు.

మంచు లింగం కరిగిపోయిన నేపథ్యంలో, యాత్రికులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తూ, అమర్‌నాథ్ శ్రైన్ బోర్డ్ (SASB) భద్రతా దళాలు బేస్ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.