
హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఆల్ఫ్రాజోలం అనే పేరు ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కల్లులో కలిపి దీనిని దుర్వినియోగం చేయడం వల్ల ఏర్పడుతున్న అనర్థాలపై ఫార్మసిస్ట్ ముజీబ్ స్పష్టత ఇచ్చారు. ఆల్ఫ్రాజోలం వాస్తవానికి బెంజోడైజిపిన్ వర్గానికి చెందిన ఒక ఔషధం. దీనిని ప్రధానంగా నిద్రలేమి (ఇన్సోమ్నియా), డిప్రెషన్, ఆందోళన (యాంగ్జైటీ) వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు వైద్యుల పర్యవేక్షణలో సూచిస్తారు. ఈ డ్రగ్ మెదడులోని గాబా రిసెప్టార్లను ప్రభావితం చేసి, శాంతపరిచే ప్రభావంతో రోగులు ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. ఇది 100% డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే వాడాలి.

అయితే, ఆల్ఫ్రాజోలంను కల్లులో కలపడం, ఇతర ఆల్కహాల్‌తో తీసుకోవడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రజలకు అధిక కిక్ ఇస్తుందని భావించి దీనిని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆల్ఫ్రాజోలం అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది, అనేక సందర్భాలలో మరణానికి కూడా కారణమవుతుంది. ఆల్కహాల్‌తో కలిపినప్పుడు దీని దుష్ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రజలు నిద్రమత్తు, మాట తడబడటం, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.

ఆల్ఫ్రాజోలం అనేది ఒక సింథటిక్ డ్రగ్, ఇది సహజంగా లభించదు. బెంజోడైజిపిన్ న్యూక్లియస్‌ను ఉపయోగించి దీనిని ల్యాబ్‌లలో తయారు చేయవచ్చు. పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు కఠినమైన ప్రొటోకాల్స్, నాణ్యతా ప్రమాణాలతో దీనిని ఉత్పత్తి చేసి, టాబ్లెట్ల రూపంలో అందిస్తాయి. అయితే, బ్లాక్ మార్కెట్లో దీనిని రా మెటీరియల్ పౌడర్ రూపంలో అమ్ముతున్నారు. చిన్న ల్యాబ్‌లలో బెంజోడైజిపిన్ న్యూక్లియస్‌లో మార్పులు చేసి సులభంగా ఉత్పత్తి చేయవచ్చని ముజీబ్ తెలిపారు. ఈ అక్రమ ఉత్పత్తిదారులు ప్యాకింగ్, లేబులింగ్ లేకుండా తక్కువ ధరకే పౌడర్‌ను అమ్ముతారు. దీనివల్ల కల్లు విక్రేతలు దీన్ని సులభంగా కల్లులో కలిపి, అధిక మత్తు కోసం ఉపయోగిస్తున్నారు.

ఆల్ఫ్రాజోలం అనేది అలవాటుగా మారే (హ్యాబిట్ ఫార్మింగ్) డ్రగ్. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది లేనిదే బ్రతకలేరు అనే స్థితికి వస్తారు. ఒకవేళ ఆపడానికి ప్రయత్నిస్తే, సీజర్స్, హ్యాండ్ షేక్స్ వంటి తీవ్రమైన ఉపసంహరణ లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ తీవ్రత కారణంగా ఆల్ఫ్రాజోలం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్‌స్టెన్సెస్ (NDPS) చట్టం పరిధిలోకి వస్తుంది.

ఈ చట్టం కింద దీని ఉత్పత్తి, విక్రయం, దుర్వినియోగం చాలా కఠినమైన శిక్షలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలల ప్రాంగణంలో కూడా అక్రమ ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రాలను కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలలో ఆల్ఫ్రాజోలం మిశ్రమ కల్లు వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయని ముజీబ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజలను అవగాహన కల్పించడం అత్యవసరం.