సాధారణంగా మెంతి ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు. అలాగే ఇతరత్రా వంటలలోనూ మెంతులను ఉపయోగిస్తుంటారు మన భారతీయ స్త్రీలు. ఇక మెంతి పొడిని అయితే ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతారు. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే.
ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి.
గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్, మధుమేహం అదుపు చేసేందుకు ఇవి దోహదపడతాయి.
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి. అజీర్తి, కడుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగాలి.
మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దాంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడంవల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.